Hair Loss Tips in Telugu : స్త్రీ, పురుషులిద్దరికీ జుట్టు రాలే సమస్య ఉంటుంది. అయితే, పురుషుల్లో చాలామందికి బట్టతల వస్తుంది. మహిళలకైతే జుట్టు పలచబడుతుంది. జుట్టు ఊడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా చాలామందిలో వంశపారంపర్యంగా ఉన్న లోపాల కారణంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. దీనికి వాతావరణ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, పోషకాహార లోపం, శుభ్రత లోపించడం వంటివి కూడా తోడవుతాయి. మారుతున్న జీవన శైలి వల్ల కూడా జుట్టు రాలే సమస్యలు పెరిగాయి.

   ఈ మధ్య చిన్న వయస్సు నుంచే ఈ సమస్య మొదలవుతోంది. జుట్టు ఎప్పటికీ స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. నిత్యం మన డైట్‌లో పోషకాహరం ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి, ఏయే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనం జుట్టును కాపాడుకోవచ్చో చూద్దామా.


ఉసిరికాయ:


విటమిన్-C అత్యధికంగా లభించే పండ్లలో ఉసిరికాయ ముఖ్యమైనది. ఉసిరికాయను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జుట్టు కుదుళ్లను బలోపేతం చేసుకోవచ్చు. జుట్టు పెరిగే క్రమాన్ని సరిదిద్దుకోవచ్చు. ఫలితంగా జుట్టు రాలే సమస్యలు ఎప్పటికీ మీ దరిచేరవు. 


కరివేపాకు:


యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే కరివేపాకును మీ డైట్ లో చేర్చడం ద్వారా జుట్టు పల్చ పడకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆకుల్లో ఉంటే బీటా కేరోటిన్,  ప్రోటీన్స్ ఆరోగ్యకరమైన జుట్టుకు దోహదం చేస్తాయి. 


కొబ్బరికాయ:


కొబ్బరిలో ఉండే సంతృప్త కొవ్వులు జుట్టు ఎదిగేందుకు చక్కగా ఉపయోగపడతాయి. కొబ్బరి నూనె తలకు పెట్టుకోవడంతో పాటు, కొబ్బరిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కూడా మీరు కేశ సంరక్షణ చేసుకోవచ్చు. 


పెరుగు:


పెరుగు అనేది విటమిన్ బి, ప్రోటీన్ లభించే పుష్కలమైన ఆహార పదార్ధం. ముఖ్యంగా జుట్టు కుదుళ్ల నుంచి కాపాడుకోవడంలో పెరుగు మీకు చక్కగా ఉపయోగపడుతుంది.  అలాగే పెరుగులో లభించే ఇతర పోషక పదార్థాలు సైతం కేశ సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. 


మెంతులు:


మెంతులులో ఉండే నికోటినిక్ యాసిడ్, ప్రోటీన్లు జుట్టు ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చుండ్రు నివారణకు మెంతుల మిశ్రమాన్ని తలకు పెట్టుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. మెంతులను ఆహారంలో చేర్చడం ద్వారా కూడా మీ కేశ సంరక్షణకు కావలసిన పదార్థాలు లభిస్తాయి. 


పాలకూర:


పాలకూరలో లభించే ఐరన్, విటమిన్ A, C మీ జుట్టును కుదుళ్ల నుంచి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు పాలకూరలో లభించే కాల్షియం కేశ సంపదకు చాలా ప్రముఖమైనది. ముఖ్యంగా మీ వెంటుకలు ఊడిపోకుండా పాలకూరలోని పోషకపోదార్థాలు మీకు సహకరిస్తాయి. పాలకూరలో లభించే ఫోలెట్ జుట్టు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. 


నువ్వులు:


నువ్వుల్లో లభించే మెగ్నీషియం, కాల్షియం మీ కేశ సంరక్షణకు విరివిగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నువ్వుల నూనెను వినియోగించడం ద్వారా మీరు అనేక పోషక పదార్థాలను పొందవచ్చు. నువ్వుల్లో ఉండే బీటా కేరోటిన్ వెంట్రుకలు పలుచగా మారకుండా కాపాడుతాయి. 


బాదం గింజలు:


బాదం గింజల్లో లభించే విటమిన్ ఈ మీ వెంట్రుకలు బలంగా ఎదిగేందుకు దోహదపడతాయి. అంతేకాదు ఇవి మీ కుదుళ్ళు బలహీనపడకుండా మంచి పోషకాలను అందిస్తాయి.  ప్రతిరోజు బాదం గింజలను నానబెట్టుకుని తినడం ద్వారా అనేక పోషకాలను పొందే వీలుంది. తద్వారా మీ కేశ సంపదను కాపాడుకోవచ్చు.


ఉల్లిపాయలు:


ఉల్లిపాయల్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తి చేయడంతోపాటు జుట్టును బలోపేతం చేయడంలో ఉల్లిపాయలు సహాయపడతాయి. 


జీలకర్ర:


జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతోపాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. 


చిలగడదుంపలు:


ఇందులో బీటా కెరోటిన్ తో ఉంటుంది. ఆరోగ్యవంతమైన తల చర్మాన్ని పోత్సహిస్తుంది. ఇందులో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. 


Also Read : కడుపు ఉబ్బరంతో పాటు బరువును తగ్గించగలిగే టీ ఇదే


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.