సాయంత్రమైతే చాలు సమోసా షాపుల ముందు జనం గుమిగూడిపోతారు. ఆలూ సమోసా, ఉల్లిపాయ సమోసా, కార్న్ సమోసా, పనీర్ సమోసా, కీమా సమోసా... ఇలా ఎన్నో రకాల సమోసాలు నోరూరిస్తుంటాయి. నిజానికి సమోసా మన దేశానికి చెందిన వంటకం కాదు. కానీ మనదేశంలో ఇదే తొలి ఫాస్ట్ ఫుడ్ అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ, భారతదేశంలో అడుగపెట్టి మాత్రం చాలా ఏళ్లు గడిచినట్టు చెబుతారు చరిత్ర కారులు. 


ఆ దేశం నుంచే...
ప్రాచీన ఇరాన్ దేశం నుంచి సమోసా భారతదేశానికి చేరిందని చెబుతారు. అంటే వేల మైళ్లు ప్రయాణించి వచ్చిందన్నమాట. అప్పట్లో చాలా మంది వర్తకులు భారతదేశానికి వచ్చేవారు. అలా ఇరాన్ నుంచి వచ్చిన వర్తకులు సమోసాలను తమతో పాటూ తీసుకొచ్చి ఇక్కడి వారికి రుచి చూపించారు. అలా వారి నుంచి స్థానికులు సమోసా తయారీని నేర్చుకున్నారు. రుచి నచ్చడంతో బాగా పాపులర్ గా మారి ఇక్కడ స్థానిక వంటకంగా మారిపోయింది. పర్షియన్ చరిత్రకారుడుైన అబ్ధుల్ ఫజల్ బెహౌకీ రచనల్లో సమోసాల ప్రస్తావన కనిపిస్తుంది. 11 వ శతాబ్దంలోని రచనల్లో కూడా సమోసాల గురించి ఉందని అంటారు. అలాగే మహమ్మద్ బీన్ తుగ్లక్ ఆస్థానంలో ఏర్పాటు చేసే విందుల్లో కూడా కచ్చితంగా సమోసా ఉండేదట. దాన్ని బీన్స్, పచ్చి బఠాణీలు వేసి చేసేవారట. పర్షియన్ పదం ‘సనుబాబాద్’ అనే పదం నుంచే సమోసా పుట్టిందని అంటారు. 


మనకు నచ్చినట్టు...
మనదేశానికి చేరాక సమోసా కొత్త రుచులను కలుపుకుంది. స్థానిక వంటకాలకు తగ్గట్టు ఇందులో అల్లం, కొత్తిమీర, జీలక్ర్ర వంటివి కూడా కలిపి వండడం మొదలుపెట్టారు. రకరకాలుగా సమోసాలను వండేందుకు ప్రయోగాలు చేశారు. అందుకే ఇప్పుడు అనేక రకాల సమోసాలు అందుబాటులో ఉన్నాయి. నూనెలో డీప్ వేయించే ఈ సమోసాను ప్రపంచంలోనే తొలి ఫాస్ట్ ఫుడ్ చెబుతారు కొంతమంది చరిత్రకారులు. మహారాష్ట్రాలో సమోసాకు జతగా ఛోలే కూరను ఇస్తారు. 


రసగుల్లాలకు ప్రసిద్ధి అయిన బెంగాల్‌లో స్వీట్ గా ఉండే సమోసాలు కూడా లభిస్తాయి. చాక్లెట్ సమోసాలు కూడా చాలా స్పెషల్. ఇప్పుడు సమోసా ప్రపంచంలో చాలా దేశాలకు ప్రయాణం కట్టింది. బ్రిటన్లో కూడా వీటిని లొట్టలేసుకుని తింటుంటారు. 


సమోసా హై కేలరీ ఫుడ్ అనే చెప్పాలి. ఇందులో వాడే పదార్థాలను బట్టి దాని కేలరీలు పెరిగిపోతాయి. సాధారణంగా మీడియం సైజులో ఉండే సమోసా తింటే 300 కేలరీలు లభిస్తాయి. 


Also read: అన్నం అధికంగా తింటే మహిళల్లో మెనోపాజ్ త్వరగా వచ్చేస్తుందా?


Also read: రెచ్చిపోతున్న ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లు, వ్యాక్సిన్లు వేసుకున్న వారికీ ముప్పు తప్పకపోవచ్చు, హెచ్చరిస్తున్న పరిశోధకులు