కరోనా కేసులు తగ్గి కాస్త తెరిపినపడుతోంది ప్రజా జీవితం. మళ్లీ ఇప్పుడిప్పుడు కరోనా కేసులు పెరగడం మొదలైంది.మొన్నటి ఒమిక్రాన్ కేసులు భయపెట్టాయి. ఇప్పుడు ఒమిక్రాన్ మ్యూటేట్ అయి ఉప వేరియంట్లు విడిపోయింది. ఇందులో BA.1, BA.2, BA.3, B.1.1.529 లు కొన్ని. ఇప్పుడు BA.4, BA.5 కూడా ఎంట్రీ ఇచ్చాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు చాలా వేగంగా ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి. వీటిని దాదాపు 57 దేశాల్లో గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇప్పుడు BA.4, BA.5 సబ్ వేరియంట్లు కొత్త కలవరానికి కారణమయ్యేలా కనిపిస్తున్నాయి. 


చాలా శక్తివంతమైనవి
దక్షిణాఫ్రికాలోని ఆఫ్రికా హెల్త్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకుల ప్రకారం BA.4, BA.5. త్వరగా వ్యాప్తి చెందే లక్షణాలు కలవి. ఇవి ప్రజల్లో కొత్త ఇన్ఫెక్షన్లను దారితీసే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ రెండు వేరియంట్లు మునుపటి కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగిన రోగనిరోధక శక్తిని, టీకా వేయించుకోవడం వల్ల వచ్చి యాంటీ బాడీలను సైతం తట్టుకుని నిలబడగల సామర్థ్యం గలవని చెబుతున్నారు ఆరోగ్య శాస్త్రవేత్తలు.  గత నెలలోనే దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ (CERI) శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ కు చెందిన రెండు కొత్త ఉప వేరియంట్లు BA.4, BA.5 లను కనుగొన్నారు.వీటిలో BA.4 డిసెంబర్ 2021లో, BA.5 జనవరి 2022లో ఉద్భవించినట్టు అంచనా వేస్తున్నారు. 


ఈ కొత్త వేరియంట్లు దక్షిణాఫ్రికాలోని ఏడు నగరాలతో పాటూ ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, చైనా, ఇజ్రాయెల్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, పాకిస్థాన్, యూకే, యూఎస్, స్విట్జర్లాండ్‌తో సహా 20 కంటే ఎక్కువ దేశాల్లో బయటపడ్డాయి. 


పరిశోధనలో భాగంలో 24 మంది టీకాలు వేయని, ఒమిక్రాన్ సోకిన వారిని ఎంపిక చేశారు. అలాగే 15 మంది టీకాలు వేసుకున్న వ్యక్తుల నుంచి శాంపిల్స్ సేకరించారు. వీరిద్దరి బ్లడ్ శాంపిల్స్ ను పరిశీలించారు. టీకా వేసుకున్న వారిలో BA.4, BA.5 వేరియంట్లను తట్టుకునే శక్తి చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది. వీటికి వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేసే శక్తి దాదాపు ఎనిమిది రెట్లు తగ్గినట్టు గుర్తించారు. 


ఒక్కసారి BA.4, BA.5 సంక్రమణ మొదలైందంటే సునామీలా విరుచుకుపడే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు పరిశోధకులు. కాకపోతే మునుపటితో పోలిస్తే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య మాత్రం పెరగదని, ప్రాణాంతకంగా మారకపోవచ్చనని కూడా అంచనా వేస్తున్నారు. కానీ రెండింటి వ్యాప్తి మాత్రం మునుపటి వేరియంట్ల కన్నా వేగంగా ఉన్నట్టు గుర్తించారు. 


Also read: ఇష్టం లేని పెళ్లి చేస్తే ఇలాగే ఉంటది మరి, వేదికపైనే వధూవరుల ఫైటింగ్


Also read: మెన్‌స్ట్రువల్ కప్ చూసి భయపడకండి, దాన్ని వాడడం చాలా సులువు