Obesity Affecting Male Reproductive Health: అంగస్తంభన లోపం అనేది సున్నితమైన అంశం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న సమస్య. అమెరికా లాంటి దేశాల్లో సుమారు 50 శాతం మంది పురుషులు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. పలు కారణాలో పురుషులలో ఈ సమస్య మరింత తీవ్రం అవుతుంది. వాటిలో ఒకటి ఊబకాయం. ఊబకాయాన్ని అదుపు చేయకుంటే అంగస్తంభన సమస్యలతో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది.
ఊబకాయంతో అంగస్తంభన సమస్య
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల అధ్యయనంలో అంగస్తంభన సమస్యకు ఊబకాయం కారణం అవుతున్నట్లు తేలింది. గత కొంతకాలంగా భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయం సమస్య పెరుగుతున్న నేపథ్యంలో అంగస్తంభన సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇటీవలి కాలంలో పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతున్నట్లు హైదరాబాద్‌కు చెందిన డయాబెటాలజిస్ట్, సెక్స్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ సునీతా సాయమ్మ వెల్లడించారు. “పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడానికి చాలా కారణాలున్నాయి. ఈ రోజుల్లో లేటుగా పెళ్లి చేసుకోవడం, వెంటనే పిల్లలు వద్దనుకోవడం కామన్ అయ్యింది. మగవారి వయస్సుతో పాటుగానే, స్పెర్మ్ నాణ్యత క్షీణించడం ప్రారంభమవుతుంది. ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం, మెటబాలిక్ సిండ్రోమ్, మధుమేహం, ఊబకాయం, పోషకాహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, పొల్యూషన్ కూడా ఈ సమస్యకు కారణం అవుతున్నాయి” అని ఆమె వెల్లడించింది.
హైపోథాలమస్ పై ఊబకాయం ప్రభావం
మగవారిలో ఊబకాయం కారణంగా టెస్టోస్టెరాన్, స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. పునరుత్పత్తి అంశాన్ని మెదడులోని హైపోథాలమస్ కంట్రోల్ చేస్తుంది. ఇది పిట్యూటరీ గ్రంధితో కమ్యూనికేట్ చేస్తుంది. అయితే, ఊబకాయం కారణంగా హైపోథాలమస్ పనితీరు మందగించి.. టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి సంబంధించిన సిగ్నలింగ్‌కు అంతరాయం కలిగిస్తుందని పరిశోధకులు గుర్తించారు. దీని వల్ల టెస్టోస్టిరాన్, స్పెర్మ్ కౌంట్ లో తగ్గుదల కలుగుతున్నట్లు వెల్లడించారు. హైపోథాలమిక్ పనితీరు దెబ్బతినడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడంతో పాటు స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని తెలిపారు.
మరింత పరిశోధన అవసరమన్న నిపుణులు
తాజాగా పరిశోధకులు ఎలుకల మీద ఈ స్టడీ కొనసాగించారు. స్థూలకాయ ఎలుకలలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని నియంత్రించే లూటినైజింగ్ హార్మోన్ (LH) తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఊబకాయం కారణంగా హైపోథాలమస్ మీద ప్రభావం పడి సంతానోత్పత్తికి ఆటంకం కలుగుతుందని ఈ పరిశోధనలో కీలకపాత్ర పోషించిన జుర్డ్ జికా కాస్ వెల్లడించారు. అంతేకాదు, ఊబకాయం కారణంగా న్యూరాన్ ల పనితీరు మందగించి హార్మోన్ తగ్గడంతో పాటు స్పెర్మ్ కౌంట్ తగ్గినట్లు తెలిపారు. అయితే, ఊబకాయం లైంగిక సామర్థ్యాన్ని ఎలా తగ్గిస్తుందనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం అని వెల్లడించారు. గత కొంతకాలంగా భారత్ లో ఊబకాయం కేసులు మరింతగా పెరుగుతున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో ఊబకాయం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
Read Also: పాము విషానికి చౌకైన విరుగుడు, ఆస్ట్రేలియన్ పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ
Read Also: ఈ లక్షణాలకు కనిపిస్తే గుండె లయ తప్పినట్టే, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త