Andhra Pradesh News: మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పలు సంఘనలపై సాయంత్రం గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. విజయవాడలో అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కలిసి రాజ్‌భవన్‌లో వైఎస్ జగన్ గవర్నర్‌ను కలుస్తారు. తమ పార్టీ నాయకులపై టీడీపీ నాయకులు చేసిన దాడులకు సంబంధించి వీడియో, ఫోటో ఆధారాలను సమర్పించనున్నారు.
రాష్టపతి పాలనకు డిమాండ్
వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దారుణంగా నరికి చంపిన ఘటనతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఆ మరుసటి రోజే వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి, ఎంపీ మిథున్‌రెడ్డి కార్లు దహనం వంటి ఘటనలపై వీడియో, ఫొటోలను ఆధారాలుగా సమర్పించనున్నట్టు వైసీపీ నాయకులు తెలిపారు. మొన్న వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం తమ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పార్లమెంట్ వద్ద ధర్నా చేస్తామని ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలవనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో రెండు సార్లు గవర్నర్‌ను కలిసి దాడులను ఆపేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. అయినా దాడులు ఆగలేదని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈరోజు మరో బాలికపై అత్యాచార ఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి ఇప్పటివరకు 31 హత్యలు, 35 ఆత్మహత్యలు, 300 హత్యాయత్నాలు, 1050 దౌర్జన్యాలు, దాడులు.., నలుగురు చిన్నారి బాలికలపై అత్యాచారాలు జరిగాయని వినుకొండలో జగన్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.
వినుకొండలో రషీద్ హత్య, ముచ్చుమర్రిలో బాలికపై అత్యాచారం హత్య
దీంతోపాటు ఉమ్మడి కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో చిన్నారి బాలికను అత్యాచారం చేసి చంపేసిన ఘటన జరిగి పద్నాలుగు రోజులు గడిడినా ఇంతవరకు మృతదేహం లభ్యం కాలేదు. ఈ ఘటనలో అనుమానితులుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న మైనర్లను ప్రశ్నిస్తున్నా వారి నుంచి స్పష్టమైన సమాచారం సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు నిన్న అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి బాలిక తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్, హోం మంత్రి వంగలపూడి అనితలను వేడుకున్నారు. కనీసం తమ కుమార్తై మృతదేహం కనిపెట్టి అప్పగిస్త అంత్యక్రియలు పూర్తి చేసుకుంటామని చెప్పిన వీడియోలు అందర్నీ కంటతడి పెట్టించాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా పలువురు సెలబ్రిటీలు సైతం ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ యువజన నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో పోలీసులు తనను అడ్డుకోవడంతో స్థానికంగా కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన సొంత గ్రామానికి వెళ్లకుండా తన మనుష్యులను పరామర్శికుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నాయకులపై వరుస దాడులపై వివరణ
వైసీపీ నాయకుల హత్యలు, ప్రజా ప్రతినిధుల మీద జరుగుతున్న దాడులు, హత్యయత్నాలు, ఆస్తుల విధ్వంసం వంటి అంశాలపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వివరించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పడంతో ప్రాణ భయంతో ఇప్పటికే చాలా మంది రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రంలో తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. నూజివీడులో వైసీపీ కౌన్సిలర్ మీద కత్తితో జరిగిన దాడి, వినుకొండలో రషీద్ దారుణ హత్యలు పోలీసుల కళ్లెదుటే జరగడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నడి రోడ్డు మీద జరిగిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన కలిగిస్తే, ముచ్చుమర్రిలో చిన్నారి బాలికపై అత్యాచారం ఘటనలు శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయా అనే సందేహం కలిగించేలా చేశాయి.. సామాన్యుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.