దీపాల వరుసనే దీపావళి అంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. మనదేశంలోని అన్ని ప్రాంతాల వారు జరుపుకునే ముఖ్యమైన పండగలలో దీపావళి కూడా ఒకటి. కులమత భేదాలు వీడి అందరూ సందడిగా చేసుకునే పండుగ దీపావళి. దీని వెనక ఎన్నో సంస్కృతి నమ్మకాలు ఆధారపడి ఉన్నాయి. ఒక్కో ప్రాంతం ప్రజలు ఒక్కో నమ్మకాన్ని కలిగి ఉన్నారు. దీపావళి పుట్టుక వెనక ఎన్నో కథలు వాడుకలో ఉన్నాయి.
రావణుని వధించాక శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకు తిరిగి వస్తాడు. ఈ సందర్భంగానే దీపావళిని జరుపుకున్నారని ఉత్తర భారత దేశంలోని ప్రజల నమ్మకం. శ్రీరాముడు సీతా లక్ష్మణులను స్వాగతించడానికి అయోధ్య ప్రజలు నూనె దీపాలను వెలిగించారట. ఆ దీపాలను తమ ఇంటి ముందు పెట్టారంట. సీతారాములు నడుస్తున్న దారంతా దీపాల వరసతో నిండిపోయింది. వారు అయోధ్యలో అడుగుపెట్టిన సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు అయోధ్య ప్రజలు. అందుకే ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో దీపావళి పండుగ రోజు ప్రజలంతా ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు.
దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి సంపదకు, శ్రేయస్సుకు అధిదేవత. మహారాష్ట్ర, గుజరాత్‌లలో దీపావళినాడు లక్ష్మీదేవి పూజలు ఘనంగా జరుగుతాయి. ఇంటిముందు రంగురంగుల ముగ్గులు నిండిపోతాయి. సంప్రదాయ వంటకాలు రెడీ అవుతాయి. వాటిని స్నేహితులకు, బంధువులకు పంచి ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటారు.
పశ్చిమ బెంగాల్లో దీపావళి రోజు కాళికామాతను ఘనంగా పూజిస్తారు. ఈరోజు కాళికాదేవిని పూజిస్తే ఆ తల్లి శక్తిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించి కాళీమాత ముందు ఉంచుతారు. ముఖ్యంగా ఈ రోజున కాళికాదేవికి స్వీట్లు, అన్నం, పప్పుతో పాటు చేపలు కూర కూడా వండి నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి ఇంటి ముందు 14 దీపాలను వెలిగిస్తారు బెంగాలీ ప్రజలు. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంటి దరి చేరవని నమ్ముతారు. అలాగే కొంతమంది శాకిని, డాకిని వేషాలను వేసుకొని రాక్షసుల్లా తిరుగుతూ ఉంటారు.
వారణాసిలో దీపావళిని ‘దేవ్ దీపావళి’ అంటారు. ఈ దీపావళి రోజున గంగా నదిలో స్నానం చేయడానికి దేవతలు వస్తారని అక్కడి భక్తుల నమ్మకం. అందుకే గంగానది ఒడ్డున రంగురంగుల ముగ్గులు వేసి దీపాలు పెడతారు. ఈ రోజున గంగా నది చూడడానికి ప్రత్యేకంగా ఎంతో మంది పర్యాటకులు వస్తారు.
ఒడిశాలో దీపావళి రోజు ఒక ముఖ్యమైన ఆచారం ఉంది. ఆ రోజున కౌరియా కతి అని పిలిచే ఆచారాన్ని నిర్వహిస్తారు. ఈ ఆచారంలో భాగంగా తమ పూర్వీకుల ఆత్మలను పిలిచి వారి ఆశీర్వాదం పొందుతారు. ఇందుకు కోసం జనపనార కర్రలను కాలుస్తారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.