Bagara Rice: తెలంగాణ స్పెషల్ వంటకం బగారా రైస్. దీన్ని మటన్, చికెన్ కర్రీకి జతగా చేసుకుని తింటారు. రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా బగారా రైస్ - మటన్ గ్రేవీ కాంబినేషన్లో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. చేయడం చాలా సులువు. బిర్యానీ చేసినంతగా కష్టపడక్కర్లేదు. కాబట్టి ఎవరైనా దీన్ని చేసుకోవచ్చు. తెలంగాణ వంటకం కదా మనకెందుకులే అనుకోవద్దు, ఆహారానికి ప్రాంతీయ బేధం లేదు. ఏ ప్రాంతం వారైనా ఒకసారి చేసుకుని తింటే వదలరు.
కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - రెండు గ్లాసులు
ఉల్లిపాయలు - రెండు
పచ్చి మిర్చి - నాలుగు
పుదీనా తరుగు - పావు కప్పు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
మసాలా దినుసులు - గుప్పెడు
(లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, షాజీరా)
నూనె - మూడు స్పూనులు
నెయ్యి - ఒక టీస్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకులు - గుప్పెడు
మసాలా ముద్ద కోసం
దాల్చిన చెక్క - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - పది
అల్లం ముక్క - చిన్నది
టమాటా - ఒకటి
గసగసాలు - ఒక టీస్పూను
ఎండుకొబ్బరి పొడి - రెండు స్పూనులు
ధనియాలు - రెండు స్పూన్లు
లవంగాలు - మూడు
అనాస పువ్వు - ఒకటి
జీలకర్ర - అర టీస్పూను
మిరియాలు - అర టీస్పూను
బిర్యానీ ఆకు - ఒకటి
తయారీ ఇలా
1. ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి శుభ్రం చేసుకోవాలి. ఒక గ్లాసు నీళ్లు పోసి పావు గంట సేపు నానబెట్టాలి.
2. ఈ లోపు మసాలా ముద్ద కోసం పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి ఒక మిక్సీలో పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టును తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. నూనె వేడెక్కాక మసాలా దినుసులైన లవంగాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, బిర్యానీ ఆకు, జాపత్రి, షాజీరా వంటివన్నీ వేసి వేయించాలి.
5. తరువాత నిలువుగా తరిగిన ఉల్లిపోయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి.
6. అన్నీ వేగాక ముందుగా మిక్సీలో చేసుకున్న మసాలా పేస్టుని కూడా వేసి వేయించాలి.
7. అందులో బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లు, ఉప్పు వేయాలి.
8. ఎసరు వేడెక్కాక అందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతీ బియ్యాన్ని వేసి కలపాలి.
9. పైన కొత్తిమీర, పుదీన చల్లి మూత పెట్టేయాలి.
10. అన్నం ఉడికాక స్టవ్ కట్టేముందు నెయ్యి పైన వేయాలి.
11. అంతే టేస్టీ బగారా రైస్ రెడీ అయినట్టే.
నిజానికి చాలమంది మసాలా పేస్టు చేసుకోరు. అది లేకుండా మిగతా ప్రాసెస్ అంతా చేస్తారు. మసాలా పేస్టు వేసుకోవడం రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా మటన్, చికెన్ వంటి కూరలు ఉన్నప్పుడు బగారా రైస్ ఇలా చేసుకుంటే అదిరిపోతుంది. ఈ కూరల్లేకపోతే కేవలం రైతా (పెరుగు చట్నీ)తో తిన్నా రుచి బావుంటుంది.
Also read: మీకు ఎవరి కాళ్లు కనిపిస్తున్నాయి? ఆడవారివా లేక మగవారివా? రెండూ ఒకేసారి కనిపిస్తే?