కరోనా వచ్చాక మొదటి వేవ్, రెండో వేవ్‌లో మరణం మృదంగం మోగిన సంగతి తెలిసినదే. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కరోనాతో మరణించారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో నమోదైన మరణాల సంఖ్య తక్కువే. దానికి కారణాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) చేసిన అధ్యయనంలో తేలింది. మన భారతీయులకు రోజూ టీ తాగడం అలవాటు. అలాగే ప్రతి కూరలో కూడా పసుపు వేసుకొని తినే ఆచారం ఉంది. ఈ రెండు అలవాట్లే భారతీయులను మరణ ప్రమాదం నుంచి కాపాడాయని అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో తక్కువ జనాభా కలిగిన పాశ్చాత్య దేశాలతో పోలిస్తే, జనసాంద్రత ఎక్కువగా ఉన్న భారతదేశంలో మరణాల రేటు ఐదు నుంచి ఎనిమిది రెట్లు తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. దీనికి మనం తీసుకున్న ఆహారమే కారణమని వెల్లడించింది. 


భారత్, బ్రెజిల్, జోర్డాన్, స్విట్జర్లాండ్, సౌదీ అరేబియాతో సహా అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఆ దేశంలో కరోనా వల్ల కలిగిన మరణాలు, వారి ఆహారపు అలవాట్లు, అలాగే భారతీయ ఆహారపు అలవాట్లు, కోవిడ్ మరణాలతో ఒక డేటాను తయారుచేశారు. ఆ డేటాను పరిశీలించాక అధ్యయనకర్తలు మన ఆహారపు అలవాట్లే మన ప్రాణాలను నిలబెట్టాయని వివరించారు. భారతీయులు ఐరన్, జింక్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకున్నారని అధ్యయనం వెల్లడించింది. ఈ ఆహారమే కోవిడ్ 19 తీవ్రతను నివారించడంలో ముఖ్యపాత్ర పోషించిందని పరిశోధనలు నిరూపించాయి. 


భారతీయులు టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ అని పిలిచే HDL శరీరంలో చేరింది. టీ లో ఉండే కాటెచిన్‌లు రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడంలో సహకరించాయి. అలాగే భారతీయులు రోజువారీ ఆహారంలో పసుపును క్రమం తప్పకుండా తీసుకున్నారు. ఇది బలమైన రోగనిరోధక శక్తిని అందించింది. పసుపులో ఉండే కర్కుమిన్ కోవిడ్ ఇన్ఫెక్షన్‌తో పోరాడే శక్తిని అందించింది. తద్వారా మరణాల రేటును తగ్గించింది.


పాశ్చాత్య దేశాల విషయానికి వస్తే వారు రెడ్ మీట్, పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారాలనే ఎక్కువగా వినియోగించారు. వీటివల్లే వారిలో మరణాల తీవ్రత పెరిగింది. అక్కడ తాగే కాఫీ, ఆల్కహాల్ వల్ల కూడా మరణాల రేటు పెరిగింది.  కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారాన్ని భారతీయులు అధికంగా తిన్నారు. 



Also read: తాజాగా వండిన అన్నం కంటే రాత్రి మిగిలిపోయినా చద్దన్నమే ఆరోగ్యకరమైనదా?





Also read: ఫ్రిజ్ నుంచి తీసిన చల్లని నీళ్లను తాగుతున్నారా? గుండెపై అది చూపే ప్రభావం ఎక్కువ
















































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.