ఒకప్పుడు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని చద్దన్నంగా మార్చి మరుసటి రోజు ఉదయం అల్పాహారంగా తినేవారు. ఇప్పుడు రోజులు మారాయి. రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని బయటపడేస్తున్నారు కానీ తినడానికి ఇష్టపడడం లేదు. ఉదయం రకరకాల టిఫిన్లు తినడం అలవాటయింది. ఉదయం పూట అన్నం తినే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. దీనివల్ల రాత్రి మిగిలిన అన్నంలోకి డస్ట్ బిన్లోకి వెళుతోంది. అయితే పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం తాజాగా ఉదయం వండిన అన్నం కంటే రాత్రి మిగిలిపోయిన చద్దన్నమే చాలా ఆరోగ్యకరమైనది. తాజాగా వండిన బియ్యంతో పోలిస్తే రాత్రి వండిన అన్నం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అలాగే బరువు కూడా పెరగరు. కాబట్టి ఉదయం తింటే మంచిది. శరీరానికి శక్తి అందుతుంది. 


అధ్యయనాలు చెబుతున్న ప్రకారం వండిన అన్నంలో ఉండే పిండి పదార్థాలను చల్లబరిచే ప్రక్రియను స్టార్చ్ రెట్రోగ్రెడేషన్ అంటారు. చద్దన్నంలో ఈ పిండి పదార్థాలు విచ్ఛిన్నం అయిపోతాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం తగ్గుతుంది. రాత్రి మిగిలిన అన్నంలో కాస్త మజ్జిగ కలిపితే ఉదయానికి పులుస్తుంది. దాన్ని తినడం వల్ల శరీరానికి ప్రోబయోటిక్ అందుతుంది. పొట్ట ఆరోగ్యానికి ఈ ప్రోబయోటిక్స్ చాలా అవసరం. పేగుల్లో ఈ ప్రొబయోటిక్స్ ఉండడం వల్లే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం.


రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని నిల్వ చేయడానికి ఎక్కువ మంది ఇబ్బంది పడతారు. అది ఉదయానికి పాడైపోతుందని అంటారు. వండిన అన్నానికి సూక్ష్మ జీవులు, బ్యాక్టిరియా వంటివి త్వరగా పట్టేస్తాయి. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఎలా నిల్వ చేయాలో వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు. గాలి చొరబడని కంటైనర్లలో ప్యాక్ చేసి ఫ్రిజ్ లో ఉంచితే ఉదయానికి తాజాగా ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినా కూడా అన్నం పాడవ్వదు. కానీ వేసవి కాలంలో పాడయ్యే అవకాశం ఉంది. అందుకే రాత్రి మజ్జిగ లేదా నీళ్లు పోసి ఉంచితే అన్నం త్వరగా పాడయ్యే అవకాశం ఉండదు. లేదా ఫ్రిజ్ లో అన్నం పెట్టాక ఉదయం తీసి మజ్జిగ, లేదా పెరుగు కలుపుకున్ని తింటే వేసవిలో పొట్టకు చల్లదనం అందుతుంది. దాహం వేయడం తగ్గుతుంది. ఇతర అల్పాహారాలతో పోలిస్తే ఇలా ఉదయాన్నే మజ్జిగన్నం తినడం చాలా మంచిది. వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. 



Also read: ఇలాంటి నట్స్ వేయించుకునే తినాలి, లేకుంటే ఏమవుతుందంటే




Also read: ఫ్రిజ్ నుంచి తీసిన చల్లని నీళ్లను తాగుతున్నారా? గుండెపై అది చూపే ప్రభావం ఎక్కువ
















































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.