ఈ రోజుల్లో టాటూలు వేయించుకోవడం ఫ్యాషన్‌గా మారింది. టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడంతో తమకు నచ్చిన డిజైన్లతో పచ్చ బొట్లు పొడిపించుకుంటున్నారు. ఈ మధ్య రంగు రంగుల టాటూలు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో యువత ఖర్చుకు కూడా వెనకాడకుండా కలర్‌ఫుల్ టాటూలు వేయించుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ టాటూలే ఇప్పుడు వారికి ప్రాణ గండంగా మరేలా ఉన్నాయి. ఔనండి.. టాటూల వల్ల క్యాన్సర్ రావచ్చని వైద్యులు చెబుతున్నారు.


రిస్క్ చాలా పెద్దది


నైపుణ్యం లేని వారితో టాటూలు వేయించుకోవడం చాలా డేంజర్. వారు ఉపయోగించే రసాయనాలు, సురక్షితం కాని నీడిల్స్ వల్ల హెపటైటిస్ బి, సి లేదా హెచ్ ఐ వి వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. టాటూల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.


కొత్త విషయాలు


స్వీడన్ లోని లున్డ్(Lund) యూనివర్సిటి పరిశోధకులు 11,905 మంది వ్యక్తుల మీద ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం ద్వారా టాటూలు వేయించుకున్న వారిలో లింఫోమా ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు దృవీకరిచారు. టాటూ వేయించుకున్న రెండేళ్లలోపు లింఫోమా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందట. టాటూ ఎక్స్సోజర్ తో లార్జ్ బీ సెల్ లింఫోమా, ఫోలిక్యూలార్ లింఫోమా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు అనిపించిందని ఈ నిపుణులు చెబుతున్నారు.


టాటూల కోసం ఉపయోగించే ఇంక్‌లో పాలీసైక్టిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్ ఉంటుందని, అది క్యాన్సర్‌కు కారణమవుతుందని తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ కూడా పచ్చబొట్టుకు ఉపయోగించే ఇంక్ ల నాణ్యతను సర్వే చేసింది. వాటి మీది లేబులింగ్‌కు కంటెంట్‌కు మధ్య తేడాలను కనుగొన్నట్టు వెల్లడించారు. ఈ పరీక్షలకు వాడిన 20 శాతం శాంపిల్స్ లోని 83 శాతం బ్లాక్ ఇంక్ లలో పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్‌ను కలిగి ఉన్నాయట. ఇవే కాకుండా ప్రమాదకరమై పాదరసం, బేరియం, రాగి,అమైన్ వంటి భారీ లోహాలు కూడా ఈ ఇంక్ లలో కనుగొన్నారట.


ఈ రసాయనాలన్నీ కూడా సాధారణ చర్మ సమస్యల నుంచి చర్మ క్యాన్సర్ వరకు కారణం కాగలవు. ఇంక్ చర్మపు వెలుపలి పొర నుంచి శరీరంలోని శోషరస వ్యవస్థలోకి శోషించబడవచ్చు. అంతేకాదు లివర్, కిడ్నీ వంటి మరికొన్ని క్యాన్సర్లకు కూడా కారణం కాగలదు. లింఫోమా, లుకేమియా వంటి రక్త సంబంధ క్యాన్సర్లను కూడా కలిగించగలవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Also Read : Sadhguru Health Tips: కఫం వేధిస్తోందా? సద్గురు సూచనలు పాటించి చూడండి - ఇలా చేస్తే వెంటనే ఉపశమనం















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.