సొరకాయ లేదా ఆనపకాయ మీరెలా పిలుచుకున్న ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేసే కూరగాయే. దీన్ని చాలా మంది పచ్చడిగానో, సాంబారులో ముక్కలుగానో ఉపయోగిస్తారు. కానీ దీనితో ఎన్నో రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. అందులో ఒకటి సొరకాయ హల్వా. దీన్ని చేయడం చాలా సింపుల్. ఇక్కడ మేము పంచదార బదులు బెల్లం వాడాము. బెల్లం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికం. ఐరన్ లోపం కూడా రాదు. పంచదార వాడడం వల్ల స్వీట్ రుచి తప్ప ఆరోగ్య ప్రయోజనాలు సున్నా. కాబట్టి మీరు కూడా బెల్లమే వాడితే మంచిది.
కావాల్సిన పదార్థాలు
లేత సొరకాయ ముక్కలు - రెండు కప్పులు
బెల్లం తురుము - అర కప్పు
పాలు - ఒక కప్పు
నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
బాదం - ఎనిమిది
జీడిపప్పు - అయిదు
కిస్ మిస్ - గుప్పెడు
యాలకుల పొడి - అరస్పూను
నెయ్యి - రెండు స్పూనులు
తయారీ ఇలా
1. సొరకాయలోని విత్తనాలను తీసేసి సన్నగా తురమాలి. ఇలా సన్నగా తురిమితే కాసేపటికి దానిలోని నీళ్లు దిగుతాయి.
2. గట్టిగా పిండితే సొరకాయలోని నీళ్లు పోతాయి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. వేడెక్కాక జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌లను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అదే కళాయిలో మిగిలిన నెయ్యిలో నీళ్లు పిండేసి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసి వేయించాలి.
5. పదినిమిషాలు వేయించాక బెల్లం తురుము కూడా వేసి కలపాలి.
6. బెల్లం కరిగి పాకంగా మారుతుంది. అప్పుడు పాలు పోయాలి.
7. స్టవ్ చాలా తక్కువ మంట మీద పెట్టి ఆ మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి. తరచూ కలుపుతూ ఉండాలి.
8. దగ్గరగా హల్వాలా అయ్యాక యాలకుల పొడి చల్లి మళ్లీ కలపాలి.
9. స్టవ్ కట్టేశాక పైన జీడిపప్పు, కిస్‌మిస్‌లు, బాదం పప్పులు వేసి కలుపుకోవాలి. అంటే సొరకాయ హల్వా రెడీ అయినట్టే.
10. దీన్ని కావాలనుకుంటే పళ్లెంలో అచ్చుపోసి ముక్కల్లా కట్ చేసుకోవచ్చు.
సొరకాయతో ఉపయోగాలు...
దీనిలో నీరు, పీచు అధికం. దీన్ని తినడం డీహైడ్రేన్ సమస్య దరిచేరదు. దీనిలో ఐరన్, పొటాషియం, విటమిన్లు అధికం. నిద్రపట్టని వాళ్లు సొరకాయను తినడం అలవాటు చేసుకుంటే మంచిగా నిద్రపడుతుంది. ఎసిడిటీ సమస్యలున్నవారికి ఇది చక్కని ఔషధం వంటిది. హైబీపీ ఉన్నవారికి సొరకాయ చాలా మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గేందుకు కూడా సొరకాయ సహకరిస్తుంది.
Also read: రాకాసి మిరపకాయ, ప్రపంచంలోనే అత్యంత స్పైసీ మిర్చి, అస్సామీల పళ్లెంలో ఇది ఉండాల్సిందే