Instant Breakfast with Egg Recipe : ఉదయాన్నే ఎక్కువ సమయం లేదు అనుకున్నప్పుడు, శరీరానికి ప్రోటీన్​ని అందించాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్​గా చేసుకోగలిగే బ్రేక్​ఫాస్ట్​ రెసిపీ ఇక్కడుంది. అదే గుడ్డుతో గుంటపొంగనాలు. ఈ రెసిపీని చేసుకోవడం చాలా సులభం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో? ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏమిటో? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. 


కావాల్సిన పదార్థాలు


గుడ్లు - 4


శనగపిండి - 1 స్పూన్


మైదా పిండి - 1 స్పూన్


అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్


టమోటాలు - 2


కరివేపాకు - 1 రెబ్బ


ఉల్లిపాయలు - 2 


పచ్చిమిర్చి - 2 


కొత్తిమీర - చిన్నకట్ట


ధనియాల పొడి - 1 టీస్పూన్


గరం మసాలా - 1 టీస్పూన్


జీలకర్ర - 1 టీస్పూన్


కారం - అర టీస్పూన్


ఉప్పు - రుచికి తగినంత


నూనె - పొంగనాలకు సరిపడినంత


తయారీ విధానం


ముందుగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. టమోటాలను, పచ్చిమిర్చిని సన్నగా కోసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీరను బాగా కడిగి.. సన్నగా తురుముకోవాలి. కొత్తిమీర ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర, ఉప్పు, కారం వేసి పదార్థాలు అన్ని బాగా కలిసేలా కలపాలి. 


బాగా మిక్స్​ అయిన ఉల్లిపాయల మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసి ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. అయితే గుడ్లు వేసి కలిపితే పిండి గడ్డలుగా ఉండేపోయే ఛాన్స్ ఉంది కాబట్టి.. ముందుగా ముక్కలకు మైదా, శనగపిండి పట్టేలా కలుపుకోవాలి. అయితే మీరు ఈ మిశ్రమంలో మైదా పిండికి బదులు బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. మైదా పిండితో పొంగనాలు కాస్త మెత్తగా, స్పాంజ్​ మాదిరి వస్తాయి. బియ్యం పిండితో వేసుకుంటే కాస్త క్రంచీగా ఉంటాయి. 


ఇలా సిద్ధం చేసుకున్న మిశ్రమంలో నాలుగు గుడ్లు పగలగొట్టి వేసి.. మిశ్రమాన్ని బాగా కలపాలి. ఓ పదినిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. పొంగనాల పాన్ పెట్టాలి. పొంగనాలలో కాస్త నూనె వేసుకోవాలి. స్టౌవ్ మంటను మీడియంపై ఉంచి.. గుంటల్లో ఎగ్ మిశ్రమాన్ని మరోసారి కలిపి వేయాలి. అవి ఒకవైపు వేగిన తర్వాత.. స్పూన్​తో మరోవైపు తిప్పి ఉడికించాలి. అంతే వేడి వేడి, టేస్టీ గుడ్డు గుంట పొంగనాలు రెడీ. వీటిని ఉదయాన్నే మీ ఎగ్ బ్రేక్​ఫాస్ట్​కి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. లేదా సాయంత్రం స్నాక్స్​గా చేసుకోవచ్చు. 



ఈ తరహా పొంగనాలను పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పెద్దలు కూడా హాయిగా లాగిస్తారు. వీటిని మీరు ఛాయ్​తో తీసుకున్న సరిపోతుంది. ప్రత్యేకంగా చట్నీ అవసరం ఏమి ఉండదు. మరికొందరు ఈ పొంగనాలు మిగిలిపోతే కర్రీ కూడా చేసుకుంటారు. మీరు ఎగ్​తో డిఫరెంట్ తరహా కర్రీలు చేయాలనుకున్నప్పుడు వీటిని చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ గుడ్డు గుంటపొంగనాలు ట్రై చేసేయండి. 


Also Read : నోరూరించే కరివేపాకు పచ్చడి.. అదిరే రుచి రావాలనుకుంటే ఈ రెసిపీని ఫాలో అయిపోండి