చాలామంది పోషకాహారలోపం కనిపించగానే విటమిన్లు సప్లిమెంట్లు మింగేస్తారు. విటమిన్ లోపాలు తీరిపోతాయనుకుంటారు, కానీ ఎలాంటి లాభం లేదని చెబుతోంది ఓ అధ్యయనం. పోషకాహారం లోటును ఏ విటమిన్ సప్లిమెంట్లు భర్తీ చేయలేవని చెబుతోంది. పోషకాహారలోపం వల్ల అనారోగ్యసమస్యలు కలిగి, అకాలమరణం సంభవించే అవకాశాలు ఎక్కువ. ఆ మరణాన్ని ఆపగల సత్తా ఆరోగ్యకరమైన ఆహారానికే తప్ప,విటమిన్ సప్లిమెంట్లకు లేవని చెబుతోంది కొత్త అధ్యయనం. 


ఎందుకు మల్టీ విటమిన్లు...
అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం సమతులాహారం తినడం వల్ల అకాల మరణాన్ని తప్పించుకోవచ్చు. ఎలాంటి అనారోగ్యాలు రాకపోతే జీవించే రేటు కూడా పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే సమతులాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. ఆ రెండూ పాటించకుండా విటమిన్ల లోపం తలెత్తగానే మల్టీ విటమిన్లు వాడతారు అనేకమంది. ఇలా వాడడం వల్ల అనారోగ్యాలు, తద్వారా అకాల మరణాలు సంభవించే రేటు పెరిగిపోతుంది. విటమిన్ సప్లిమెంట్లు ఏమాత్రం జీవితాకాలాన్ని పెంచవని, సమతులాహారాన్ని అవి భర్తీ చేయలేవని అధ్యయనకర్తలు తేల్చి చెప్పారు. 


పరిశోధన సాగిందిలా...
దాదాపు 30,000 మందిపై ఈ అధ్యయనం సాగింది.హెల్త్ అండ్ న్యూట్రిసన్ ఎగ్జామినేషన్ సర్వేలో దాదాపు పదేళ్లు వీరందరూ పాల్గొన్నారు. వారు తిన్న ఆహారాలను, తీసుకున్న సప్లిమెంట్ల డేటాను పొందుపరిచారు. వారి పోషకస్థాయిలను అంచనావేశారు. అలా ఏళ్ల పాటూ వారి ఆహార అలవాట్లను గమనించారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 3,600 మందికి పైగా మరణించారు. వారిలో 945 మంది గుండె జబ్బులు, 805 మంది క్యాన్సర్ తో అకాల మరణం బారిన పడ్డారు. వీరిలో అధికశాతం మంది పోషకాలు సరిగా అందక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు వాడుతున్నవారే. విటమిన్ లోపాలు కూడా వారిలో వ్యాధితీవ్రతను పెంచుతాయి. విటమిన్ సప్లిమెంట్లు వాడినప్పటవికీ వారిలో ఆ లోపం సంపూర్ణంగా తీరలేదు. అయితే మంచి ఆహారం తీసుకున్నవారిలో మాత్రం విటమిన్ లోపాలు తీరడమే కాదు, వారు అధిక కాలం జీవించినట్టు గుర్తించారు. దీన్ని బట్టి పోషకాహారాలోపాన్ని విటమిన్ సప్లిమెంట్లు సంపూర్ణంగా తీర్చలేవని తేల్చారు. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: ఈ ఆహారాలకు ఎక్స్‌పైరీ డేటే లేదు, ఎన్నాళ్లయినా వాడుకోవచ్చు


Also read:  ప్రపంచంలో ఎయిడ్స్ నయమైన తొలి మహిళ, ఇప్పటికి ముగ్గురిలో జరిగిందిలా