కన్న కూతురి కన్నా వివాహేతర సంబంధమే ముఖ్యమని అనుకుంది. ప్రియుడు రెండేళ్ల కుమార్తెను ఎన్ని చిత్ర హింసలు పెట్టినా అడ్డు చెప్పకుండా నెలల తరబడి అతనితో సహజీవనం చేసింది. అతని పైశాచికత్వం మరీ పెరిగిపోయి చిన్నారిని మరింత తీవ్రంగా హింసించినా నోరు మెదపలేదు. పైగా విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసింది. స్థానికులు ఈ విషయం గుర్తించడంతో విషయం బయటకు పొక్కింది. చివరకు శిశు సంరక్షణ అధికారులకు తెలియడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.


సాధారణంగా రెండేళ్ల చిన్నారి అంటే.. అభం శుభం తెలియని ఆ బాలిక ముద్దులొలికే పలుకులు వింటూ ఎవరైనా ఆనందిస్తారు. చిట్టి నడకతో ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తుంటే మురిసిపోతారు. కానీ, ఈ కర్కశుడు ఆ బాలిక పట్ల యముడిలా వ్యవహరించాడు. తన ప్రియురాలి కుమార్తె అయిన రెండేళ్ల బాలికను 7 నెలలుగా చిత్రహింసలు పెడుతూనే ఉన్నాడు. గురువారం ఆ ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం కొత్తపేట సమీపంలో 26 ఏళ్ల వివాహిత నివాసం ఉంటోంది. ఈమెకు గత నాలుగేళ్ల క్రితమే పెళ్లి జరిగింది. కానీ, కొద్ది కాలం క్రితం ఆమె భర్త ఆమెను వదిలేశాడు. అప్పటికే ఆమెకు రెండేళ్ల వయసు ఉన్న చిన్నారి ఉంది. పొట్ట పోషించుకొనేందుకు ఆమె కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు అదే జిల్లా నెల్లిమర్లలో ఓ శుభకార్యంలో ఎలక్ట్రీషియన్‌ గా పని చేసే చిన్నా అనే 29 ఏళ్ల యువకుడు పరిచయం అయ్యాడు. ఈమెకు భర్త ఉన్నా వదిలేయడంతో అది క్రమంగా సహజీవనానికి దారి తీసింది. 


ఇద్దరూ ఓ ఇల్లు అద్దెకు తీసుకొని మరీ నివాసం ఉంటున్నారు. అయితే, తల్లితో పాటే ఉంటున్న రెండేళ్ల కుమార్తెను ఏడు నెలలుగా ప్రియుడు చిన్నా కొట్టడం, రక్కడం వంటి వికృత చేష్టలకు పాల్పడేవాడు. అయినా ఆ కఠిన మనస్తత్వం ఉన్న తల్లి మనసు కనికరించలేదు. చిన్నా ఆమెపై ఘోరాలకు పాల్పడుతున్నా ఆమె అడ్డు చెప్పలేదు. బుధవారం రాత్రి తల్లి ఇంట్లో లేనప్పుడు ఆ చిన్న పాప బుగ్గలు, చేతులు, కాళ్లను చిన్నా కొరికేశాడు. ఆమె ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తుండటంతో చుట్టుపక్కల ఏమైందని అడిగారు. దీంతో ఆమె విషయాన్ని దాటవేసి ప్రియుడ్ని వెనకేసుకొచ్చింది. స్థానికుల ద్వారా అంగన్‌వాడీ సిబ్బందికి విషయం తెలియడంతో స్థానిక మహిళా సంరక్షణ పోలీసుకు సమాచారం అందించారు. తల్లి ఫిర్యాదు మేరకు చిన్నాను రిమాండుకు తరలించామని దిశ పోలీసులు వెల్లడించారు. బాలికను వైద్య చికిత్సలకు ఆసుపత్రికి తరలించామని, తల్లికి వ్యక్తిత్వ, మానసిక నిపుణుల వద్ద కౌన్సెలింగ్‌ చేయిస్తామని వెల్లడించారు.