సూపర్ మార్కెట్‌కు వెళ్లి ఏం కొనాలన్న అందరూ మొదట చూసేది ఎక్స్‌పైరీ డేట్. ఆ తేదీని బట్టే ఆ ఉత్పత్తిని వాడవచ్చు, తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకుంటారు. కానీ అసలు ఎక్స్‌పైరీ తేదీయే లేని ఆహార ఉత్పత్తులు కూడా ఉన్నాయి. వీటిని ఎన్ని నెలల తరువాత వాడుకోవచ్చు. రుచి, రూపం, రంగు మారదు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజమే. గడువు తేదీ లేని ఆహారాలేంటో తెలుసుకోండి మరి.
ఉప్పు
ఉప్పుకి ఎప్పటికీ పాతదైపోదు,పాడైపోదు. అందుకే ఊరగాయలు, పచ్చళ్లు, డ్రై స్నాక్స్ వంటి వాటిల్లో ఉప్పును అధికంగా వాడతారు. ఎక్కువ కాలంపాటూ తాజాగా ఉండేలా చేస్తుందది. సముద్రం నుంచి తీసిన స్వచ్ఛమైన ఉప్పు ఎన్ని సంవత్సరాలైన అలాగే ఉంటుంది. మధ్యలో అయోడిన్, ఇతర సమ్మేళనాలు చేర్చబడిన ఉప్పు మాత్రం కొన్ని నెలల తరువాత పాడయ్యే అవకాశం ఉంది. గడ్డ ఉప్పు లేదా కళ్లుప్పు అని పిలవబడే ఉప్పు మాత్రం చాలా ఏళ్లు తాజాగా ఉంటుంది.
తేనె
దీన్ని లిక్విడ్ గోల్డ్ గా పిలుస్తారు. పోషకాలతో నిండి ఉంటుంది. దీనికి కూడా గడువు తేదీ అంటూ ఏదీ లేదు. ఈజిప్టులోని మమ్మీల సమాధుల్లో వందల ఏళ్ల నాటి తేనెను కనిపెట్టిన సంగతి తెలిసిందే. ఏమాత్రం చెక్కుచెదరని ఆ తేనెను శాస్తవేత్తలు రుచి చూసి కితాబు కూడా ఇచ్చారు. దీన్ని గాలి చొరబడని డబ్బాల్లో ఉంచితే వేల ఏళ్లయినా అలానే ఉంటుంది. అయితే అది స్వచ్ఛమైన తేనె అయి ఉండాలి. ప్రాసెస్ చేసినది కాకూడదు. తేనెలో సూక్ష్మజీవులు చేరకపోవడానికి కారణం అందులో నీటి శాతం అతి తక్కువ. అందుకే తేనె చెక్కుచెదరదు.
కాఫీ గింజలు
కాఫీ గింజలకు కూడా ఎక్స్‌పైరీ తేదీ లేదు. కాఫీ గింజల పొడి కూడా ఈ కోవలేకే వస్తుంది. అది ఏ ఇతర పదార్థం కలపని, ప్రాసెస్ చేయని కాఫీ గింజలు లేదా పొడి ఎన్ని ఏళ్లయినా రుచి కోల్పోకుండా, పాడవకుండా అలానే ఉంటుంది. కాఫీ గింజల్ని ఎండకు బాగా ఎండబెడతారు. ఆ తరువాతే పొడి కొడతారు. ఎక్కడ నీటి జాడే ఉండదు.కాబట్టి చెడిపోయే అవకాశం చాలా తక్కువ.
సోయా సాస్
ఇది నమ్మశక్యంగా లేనప్పటికీ నిజమే. సోయా సాస్ కూడా ఏళ్ల పాటూ పాడవకుండా ఉంటుంది. దీన్ని తయారుచేసే ప్రక్రియలో పులియబెట్టడం (Fermentation) అనేది ముఖ్య ప్రక్రియ.ఇందులో ఉప్పును కూడా వాడతారు. ఎలాంటి ఇతర ఆహార ఉత్పత్తులు కలపని సోయాసాస్ తేనెలాగే వందల ఏళ్లు ఉంటుంది. అయితే గాలి అధికంగా తగలకుండా చూసుకోవాలి.
Also read: ప్రపంచంలో ఎయిడ్స్ నయమైన తొలి మహిళ, ఇప్పటికి ముగ్గురిలో జరిగిందిలా
Also Read: కాబోయే భార్యను అలా చూసి ఆనందం పట్టలేకపోయిన వరుడు, వీడియో వైరల్