Healthy Breakfast : పిల్లలు ఇష్టంగా తినగలిగే, మధుమేహులు కూడా ఎలాంటి బెరుకు లేకుండా తీసుకోగలిగే హెల్తీ, టేస్టీ రెసిపీ గురించి మీకు తెలుసా? అయితే మీరు కచ్చితంగా అరటిపండుతో చేసే తియ్యని పొంగనాలు చేసుకోవాల్సిందే. సాధారణంగా పొంగనాలు అంటే కాస్త హాట్, స్పైసీగా తయారు చేసుకుంటారు. కానీ అరటిపండుతో టేస్టీ, హెల్తీ, స్వీట్ పొంగనాలు చేసుకోవచ్చు. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేయగలిగే ఫుడ్ అవుతుంది. వీటిని మీరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా.. సాయంత్రం టేస్టీ స్నాక్‌గా తీసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - 1 కప్పు
అరటిపండు - 2
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
బెల్లం తురుము - అర కప్పు
నీరు - తగినంత
సోడా - చిటికెడు
యాలకుల పొడి - చిటికెడు
తయారీ విధానం
ముందుగా స్టౌవ్ వెలిగించి దానిలో దానిపై కడాయి పెట్టండి. దానిలో నీరు వేసి.. అది వేడి అయ్యాక దానిలో బెల్లం వేయండి. పూర్తిగా కరిగేవరకు ఉంచి.. స్టౌవ్ ఆపేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఓ గిన్నెలో అరటిపండ్ల ముక్కలు వేసి బాగా చిదమండి. మెత్తగా మాష్ చేసిన తర్వాత దానిని మిక్సింగ్ గిన్నెలోకి తీసుకుని.. దానిలో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లం నీటిని వడకట్టి పోయండి. ఎందుకంటే బెల్లంలో ఉండే మలినాలు లేదా మట్టి అరటిపండులోకి పడిపోతుంది. ఈ రెండింటిని బ్లెండ్ అయ్యేలా బాగా మిక్స్ చేయండి.
ఇప్పుడు దానిలో కొబ్బరి తురుము వేయండి. అనంతరం గోధుమ పిండి, బియ్యం పిండి, సోడా వేసి బాగా కలపండి. అనంతరం నీరు పోస్తూ.. ఉండలు లేకుండా పిండిని బాగా కలపండి. ఎక్కువ నీరు వేయకుండా పిండిని కలిపి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పొంగనాల పాన్ పెట్టాలి. ఒక్కో అచ్చులో నెయ్యి వేయాలి. అది వేడిగా అయినప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని.. అచ్చులో 3/4 నింపడానికి టేబుల్ స్పూన్‌తో పిండి వేయాలి. దానిపై మూత వేసి 4 నిమిషాలు మగ్గనివ్వాలి. అనంతరం మూత తీసేసి.. వాటిని మరోవైపు తిప్పి కాల్చాలి. అంచులు బంగారు రంగులోకి మారిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే వేడి వేడి స్వీట్ పొంగనాలు రెడీ.
స్వీట్ పొంగనాలను మీరు వేడిగా లేదా చల్లగా కూడా తినొచ్చు. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని మీరు బ్రేక్‌ఫాస్ట్ రూపంలో కానీ.. పిల్లలకు స్నాక్స్ బాక్స్‌గా కూడా పెట్టవచ్చు. లేదంటే సాయంత్రం స్నాక్స్‌గా కూడా చేసుకోవచ్చు.ఈ రెసిపీలో మీరు కొబ్బరి తురుము తాజాది వేసుకుంటే రుచి రెట్టింపు అవుతుంది. బియ్యం పిండికి బదులుగా మీరు రవ్వను కూడా వేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి.. ఇంటిల్లిపాదీ ఆస్వాదించేయండి.
Also Read : క్రంచీ, టేస్టీ మసాలా వడలు.. బ్రెడ్‌తో ఇలా ఇన్‌స్టాంట్‌గా తయారు చేసుకోవచ్చు