Summer Special Pesara Avakaya: ఆవకాయ్..ఈ మాట వింటనే నోరూరిపోతుంది. అస్సలు బోర్ కొట్టకుండా ఆస్వాదించేస్తారు. చిన్నా పెద్దా...పేద గొప్పా అనే భేదం లేదు. సమ్మర్ వచ్చిందంటే చాలు ఆవకాయ అన్నం తినాల్సిందే. అయితే నిత్యం ఆవకాయతో తింటే వేడిచేస్తుందనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ఎందుకంటే మామూలు ఆవకాయ్ లో ఆవపిండి కలుపుతారు..అందుకే వేడిచేస్తుంది. కానీ ఇప్పుడు పెసర ఆవకాయలో పెసరపిండి కలుపుతారు. పెసలు వంటికి చలువచేస్తాయి. శరీరంలో వేడిని తగ్గిస్తాయి. అందుకే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం పెసర ఆవకాయ.
పెసర ఆవకాయ పెట్టేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చిటికెలో చేసేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు తక్కువే..ప్రాసెస్ కూడా చిన్నదే. ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టేయండి...
పెసర ఆవకాయ పెట్టడానికి కావాల్సిన పదార్థాలు
మామిడి ముక్కలు - 6 కప్పులు
కారం - ఒక కప్పు
రాళ్ల ఉప్పు - కప్పు కన్నా తక్కువ
పెసర పిండి - ఒక కప్పు
పసుపు - చిటికెడు
నువ్వుల నూనె , పల్లీ నూనె ఏదైనా పర్వాలేదు
ముందుగా మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడగొచ్చు లేదంటే తడిగుడ్డతో నీటిగా తుడవొచ్చు. కట్ చేసే సమయానికి మామిడికాయ తడిగా ఉండకూడదు. జీడిని తీసేసి మీకు కావాల్సిన సైజ్ లో ముక్కలు తరిగి పెట్టుకోవాలి
పెసరపిండి కూడా మరపట్టించింది కాకుండా ఇంట్లోనే మిక్సీ పట్టుకోవడం మంచిది. పెసరపప్పు శుభ్రం చేసి రోజంతా ఎండబెట్టాలి. సాయంత్రానికి బాగా ఎండిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా పొడి చేసేసుకోవాల్సిన అవసరం లేదు..కాస్త బరకగా ఉండొచ్చు.
పెసర ఆవకాయ తయారు చేసే విధానం
ఓ బౌల్ తీసుకుని ఉప్పు, కారం, పెసరపిండి వేయాలి. కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు కూడా అందులో వేసి ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. ముక్కలు మునిగేవరకూ నూనె పోసి మళ్లీ కలపాలి. ఉప్పు, కారం మీకు ఇంకాస్త ఎక్కువకావాలంటే కలుపుకోవచ్చు, మీరు తీసుకున్న మామిడికాయ సైజ్, ముక్కల లెక్క ఆధారంగా ఈ కొలతలు ఎక్కువ తక్కువ అవుతాయి. మొత్తం కలిపేసిన తర్వాత పల్చగా అయినట్టు అనిపిస్తే ఇంకొంచెం పెసరపిండి వేసుకోవచ్చు. దాన్ని మూతపెట్టేసి రెండు రోజులు వదిలేయాలి. మూడో రోజు ఓపెన్ చేసి బాగా కలపి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే... నోరూరుతోందా ..ఇంకెందుకు ఆలస్యం ఇలా సింపిల్ గా ఆవకాయ పెట్టేసుకోండి మరి.
ముక్కలు కట్ చేసిన పెట్టిన తర్వాత ఎక్కువ సేపు ఉంచేయవద్దు మెత్తబడతాయి. ముందుగా అన్నీ సిద్ధం చేసుకుని అప్పుడు ముక్కలు కట్ చేసుకుని వెంటనే కలిపేసుకోండి.
ఇందులో పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు
పెసర ఆవకాయ్ ని చిన్నపిల్లల నుంచి పెద్దలవరకూ అందరూ వేసుకోవచ్చు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. సమ్మర్లో వేడిచేస్తుంది అనే భయం లేకుండా ఎంచక్కా పెసర ఆవకాయను రోజూ తిన్నా ఏం కాదు.
పెసరపిండి ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. తొందరగా రుచి మారిపోతుంది. అందుకే రెండు మూడు వారాలకు సరిపడా వేసుకుని అది అయిపోయిన తర్వాత మళ్లీ ఎప్పటికప్పుడు పెసరపిండి ఆవకాయ పెట్టుకోవచ్చు.