Constant Tiredness in Summer : మండుటెండ, చెమట, ఉక్కపోత ఇబ్బంది పెడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. దీంతో ఇప్పటికే చాలామంది వివిధ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అలసట, నీరసం, ఆయాసం వంటివాటిని లైట్ తీసుకోవద్దని.. అంటున్నారు. ఎందుకంటే ఇవి కేవలం ఎండ వల్లే కాకుండా.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. 

Continues below advertisement

అలసటను ఎందుకు లైట్ తీసుకోవద్దంటే.. 

వేడికి కొద్దిగా అలసటగా అనిపించడం సాధారణ విషయమే. అయినప్పటికీ.. పెద్దగా పని చేయకపోయినా తీవ్రమైన అలసటగా అనిపించినా.. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఆయాసంగా ఉన్నా.. చేతులు, కాళ్లలో నొప్పి ఉంటే.. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేయడం పెద్ద పొరపాటు కావచ్చని చెప్తున్నారు. ఎందుకుంటే ఈ అనుభూతులు మీ శరీరంపై పడే ఒత్తిడి వల్ల జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల ప్రకారం.. వడదెబ్బ అనేది దాగివున్న అనారోగ్యానికి కూడా ఒక సంకేతం కావచ్చు. అందువల్ల ఈ సంకేతాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం.

డీహైడ్రేషన్ కావచ్చు..

వేసవిలో చెమట ద్వారా శరీరం నుంచి అధిక మొత్తంలో ఎలక్ట్రోలైట్లు కోల్పోతాము. ఇటువంటి పరిస్థితిలో ఎప్పటికప్పుడు నీరు తాగకపోతే.. శరీరంలో డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. దీని కారణంగా నీరసం, తల తిరగడం, తలనొప్పి, తరచుగా అలసట వంటివి ప్రారంభమవుతాయి. అలాగే చాలా మంది రోజంతా పనిలో ఎంతగానో నిమగ్నమై ఉండి.. నీరు తాగడమే మర్చిపోతారు. ఈ నిర్లక్ష్యం తరువాత వారి శరీరాన్ని లోపలి నుంచి బలహీనపరుస్తుంది. 

Continues below advertisement

ఇలాంటి పరిస్థితిలో కేవలం దాహం వేసే వరకు వేచి ఉండకుండా నీళ్లు తాగాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. క్రమం తప్పకుండా నీరు, నిమ్మరసం లేదా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. 

రక్తహీనత..

వేసవిలో మీకు ఎక్కువ నీరసంగా, బలహీనంగా, అలసటగా అనిపిస్తుంటే.. అది శరీరంలో రక్తహీనతకు సంకేతం కావచ్చు. ఈ సమస్య ముఖ్యంగా మహిళలు, యువతులలో సాధారణంగా ఉంటుంది. ఐరన్ లోపం వల్ల శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఇది అలసటకు దారితీస్తుంది. దీనివల్ల అలసట కలగడమే కాకుండా.. ముఖంలో కాంతి తగ్గి.. చేతులు, పాదాలు కూడా చల్లగా మారతాయి. తల తిరగడం కూడా దీనిలోని లక్షణమే. 

ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ ఆహారంలో ఆకుకూరలు, బీట్‌రూట్, దానిమ్మపండ్లు, ఐరన్ రిచ్ ఫుడ్స్ చేర్చుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

మధమేహం లేదా థైరాయిడ్.. 

తరచుగా అలసటగా ఉండటం అనేది మధుమేహం లేదా థైరాయిడ్ వ్యాధి వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కూడా సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో.. మీకు అలసటతో పాటు అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, లేదా ఆకస్మిక బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివి గమనిస్తే.. మీరు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

థైరాయిడ్ సమస్యల వల్ల నీరసం, అలసట కలుగుతాయి. దీంతో ఎప్పుడూ అలసిపోయినట్లుగా భావిస్తారు. చాలా మంది దీనిని కేవలం ఒక సాధారణ పరిస్థితిగా కొట్టిపారేస్తారు. కానీ అంతర్లీనంగా ఉన్న సమస్య మరింత తీవ్రమవుతూ ఉంటుంది.

నిద్ర ప్రభావం..

ఈ మధ్యకాలంలో చాలామంది తగినంత నిద్రపోలేకపోతున్నారు. ఇది వారి శరీర శక్తిపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తికి రోజు 6 నుంచి 7 గంటల మంచి నిద్ర అవసరం. లేదంటే మరుసటి రోజు అతని శరీరం అలసటగా అనిపిస్తుంది. ఇది కాకుండా మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరంతర పని ఒత్తిడి కూడా శరీరాన్ని లోపలి నుంచి బలహీనపరుస్తాయి. కొన్ని పరిస్థితులలో ఒక వ్యక్తి శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువగా అలసిపోవడం కూడా జరుగుతుంది. ఇది ఎక్కువ కాలం కొనసాగితే.. పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా విశ్రాంతి ఇవ్వడం ముఖ్యమని గుర్తించాలి.

జంక్ ఫుడ్స్..

జంక్ ఫుడ్, వేయించిన ఫుడ్స్, షుగర్ డ్రింక్స్ వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఈ ఆహారాలు తాత్కాలిక ఉపశమనాన్ని అందించినప్పటికీ.. శక్తిని ఇవ్వవు. దీనివల్ల నీరసం వస్తుంది. సరైన పోషకాహారం లేకపోవడం వల్ల శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. అందుకే పెరుగు, పండ్లు, సలాడ్లు, ఇంట్లో తయారుచేసిన భోజనం వంటి తేలికైన, తాజా, పోషకాహారాలు తినడం చాలా ముఖ్యం. ఇవి వేసవి వేడిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

ఈ అలసట కొన్ని రోజుల పాటు కొనసాగితే.. రోజువారీ పనులను చేయడంలో కూడా ఇబ్బంది పడుతుంటే.. తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. కొన్నిసార్లు చిన్నదిగా కనిపించే ఈ అలసట ఒక తీవ్రమైన అనారోగ్యానికి నాంది కావచ్చు. సకాలంలో చికిత్స తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.