Revanth Reddy Ntional Politics Strategy:  తెలంగాణ రాజకీయాల్లో అధికారం దక్కించుకున్న ఏ నాయకుడికైనా ఢిల్లీ  పీఠం ఒక తీపి కల. గతంలో కేసీఆర్ తన రెండో విడత పాలన చివరలో బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నించి, చివరికి సొంత ఇలాకాలోనే పట్టు కోల్పోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన మొదటి విడత పాలనలోనే.. అది కూడా పదవి చేపట్టిన కొద్ది కాలానికే తన జాతీయ ఆకాంక్షలను బయటపెట్టారు. అయితే కేసీఆర్ ప్రస్థానానికి, రేవంత్ రెడ్డి ఆలోచనలకు మధ్య మౌలికమైన తేడాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఉన్న అతిపెద్ద సానుకూలత  కాంగ్రెస్  అనే జాతీయ పార్టీ అండ. కేసీఆర్ శూన్యం నుంచి ఒక జాతీయ వేదికను నిర్మించాల్సి రాగా, రేవంత్ కేవలం ఉన్న పార్టీలోనే తన స్థాయిని పెంచుకుంటే సరిపోతుంది.

Continues below advertisement

 రేవంత్ ముందస్తు అడుగులు 

రేవంత్ తనకు జాతీయ ఆశలు ఉన్నాయని కానీ ఇప్పుడే కాదని చెబుతున్నారు. 2034లో అని చెబుతున్నారు.  కేసీఆర్ తన రెండో పదవీకాలం ముగిసే వేళ జాతీయ రాజకీయాల గురించి గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పటికే పదేళ్ల పాలనపై వ్యతిరేకత  మొదలైంది. కానీ రేవంత్ రెడ్డి తన మొదటి టర్మ్‌లోనే తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా సాహసమే.  నేను రెండు సార్లు సీఎంగా ఉంటాను, ఆ తర్వాతే జాతీయ రాజకీయాలకు వెళ్తాను  అని చెప్పడం ద్వారా ఆయన తన కేడర్‌లో స్థిరత్వాన్ని నింపాలని చూస్తున్నారు. అయితే, పాలన ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజలు  ముఖ్యమంత్రి దృష్టి పాలన మీద ఉందా లేక వ్యక్తిగత ఎదుగుదల మీద ఉందా అని ప్రశ్నించే అవకాశం ఉంది.

Continues below advertisement

రేవంత్‌కు ప్లస్‌లు..మైనస్సులు

బీఆర్ఎస్ అనేది కేసీఆర్ ,  ఆయన కుటుంబం చుట్టూ తిరిగే పార్టీ. అక్కడ నిర్ణయాధికారం ఒక్కరిదే. కానీ కాంగ్రెస్ అలా కాదు. ఇక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం ఎంత ఉంటుందో, గ్రూపు రాజకీయాలు కూడా అంతే బలంగా ఉంటాయి. రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే బలమైన ప్రత్యర్థులు, సీనియర్లు ఉన్నారు. జాతీయ స్థాయికి ఎదగాలంటే ఆయన కేవలం ప్రతిపక్షాలనే కాదు, పార్టీలోని ఇతర పవర్ సెంటర్లను కూడా అధిగమించాల్సి ఉంటుంది. కేసీఆర్‌కు పార్టీలో ఎదురులేకపోవడం ఒక ప్లస్ అయితే, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యం అతిపెద్ద బలం. కేసీఆర్ తన హయాంలో తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించారు. రేవంత్ రెడ్డి ఇంకా ఆ స్థాయికి చేరుకోవాల్సి ఉంది. పాలనలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయడం, ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా మాత్రమే ఆయన రెండోసారి ముఖ్యమంత్రి కాగలరు. ఒకవేళ సంక్షేమ పథకాల్లో విఫలమైతే, 2034 లక్ష్యం అనేది కేవలం కలగానే మిగిలిపోతుంది. తెలంగాణ ప్రజలు ప్రాంతీయ సెంటిమెంట్‌ కు ప్రాధాన్యత ఇస్తారు. తమ సీఎం ఢిల్లీ పర్యటనలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ప్రజలు భావిస్తే, అది రాజకీయంగా పెద్ద డ్యామేజ్ కలిగిస్తుంది.

 కేసీఆర్ పతనం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం 

తెలంగాణ సమాజం తమ నాయకుడు తమ కోసమే పని చేయాలని కోరుకుంటుంది. కేసీఆర్ ఎప్పుడైతే  అబ్ కీ బార్ కిసాన్ సర్కార్  అంటూ ఇతర రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారో, అప్పుడే తెలంగాణ ఓటర్లు ఆయనకు దూరం కావడం మొదలైంది. రేవంత్ రెడ్డి ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.  రేవంత్ రెడ్డి జాతీయ నాయకుడిగా ఎదగాలంటే, ముందుగా తెలంగాణలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి. ఒకవేళ తెలంగాణ ప్రజలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తే, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే ఉండదు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డికి బలమైన నెట్‌వర్క్, జాతీయ పార్టీ నేపథ్యం ఉన్న మాట వాస్తవమే అయినా.. రాజకీయాల్లో  ప్రజా తీర్పు  అత్యంత శక్తివంతమైనది. రేవంత్ రెడ్డి తన పాలనతో ప్రజలను మెప్పిస్తూ, ఢిల్లీ వైపు అడుగులు వేస్తేనే ఆయన కేసీఆర్ కంటే మెరుగైన ఫలితాలు సాధించగలరనేది ఎక్కువ మంది అభిప్రాయం.