Modi Political Strategy On Revanth:   జాతీయ,  తెలంగాణ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వ్యూహాలు అత్యంత ఆసక్తికరంగా, అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని బలమైన , చురుకైన నాయకులను లక్ష్యంగా చేసుకుని మోదీ పన్నుతున్న  మైండ్ గేమ్ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది.   రాజకీయ వ్యూహంలో కొత్త కోణం 

Continues below advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లో డైరెక్ట్ ఫైట్  కంటే  సైకలాజికల్ వార్ చేయడంలో దిట్ట. కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులను నేరుగా విమర్శించడం కంటే, వారిపై సొంత పార్టీలోనే అనుమానాలు కలిగేలా చేయడం మోదీ మార్కు రాజకీయం. గతంలో హిమంత బిస్వా శర్మ, జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు ఆయన దృష్టి దక్షిణాదిలో కాంగ్రెస్‌కు పవర్‌ హౌస్‌గా మారిన రేవంత్ రెడ్డిపై పడింది. రేవంత్‌ను ప్రశంసించడం ద్వారా లేదా ఆయనకు సానుకూల సంకేతాలు పంపడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో ఆయనను అనుమానితుడిగా నిలబెట్టాలనేది మోదీ వ్యూహంగా కనిపిస్తోంది.

 మోదీ పిలుపు - రేవంత్ సంకట స్థితి 

Continues below advertisement

హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి రావాలని నర్మగర్భంగా పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి ఒకవైపు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండాల్సి వస్తోంది. విభజన హామీలు, నిధుల కోసం ఆయన ప్రధానితో భేటీ అవుతుంటే, దానిని రాజకీయంగా ఉపయోగించుకోవడంలో బీజేపీ వ్యూహకర్తలు సఫలమవుతున్నారు. ఇది రేవంత్‌కు ఒక రకమైన  ధర్మసంకటం  లాంటిదే. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి నష్టం, కలిసుంటే సొంత పార్టీలో ముద్ర పడే ప్రమాదం ఉంది. మరోవైపు, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్  ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. రేవంత్ రెడ్డి ఏనాటికైనా బీజేపీలోకి వెళ్తారని, ఆయన ఆర్ఎస్ఎస్  భావజాలం ఉన్న వ్యక్తి అని కేటీఆర్ వంటి నేతలు పదేపదే ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నేతలతో రేవంత్ టచ్‌లో ఉన్నారనే పుకార్లను లేవనెత్తడం ద్వారా కాంగ్రెస్ కేడర్‌లో,  ప్రజల్లో గందరగోళం సృష్టించాలన్నది వారి ప్లాన్. మోదీ వేస్తున్న పాచికలకు బీఆర్ఎస్ ప్రచారం తోడవ్వడం రేవంత్‌కు రాజకీయంగా ఇబ్బందికర పరిణామమే.

 రేవంత్ దూకుడు - మోదీపై విమర్శలు 

అయితే రేవంత్ రెడ్డి శైలి ఇందుకు భిన్నంగా ఉంటుంది. రాజకీయ అవసరం ఏర్పడినప్పుడు మోదీని  డెమోన్ అని విమర్శించడానికి కూడా ఆయన వెనుకాడరు. తెలంగాణా గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో ఆయన చూపిన దూకుడు వెనుక మోదీ-షా ద్వయాన్ని ఢీకొనే ధైర్యం ఉంది. కానీ, మోదీ విసిరే  ప్రశంసల అస్త్రాలు  విమర్శల కంటే ప్రమాదకరమైనవి. శత్రువును విమర్శించడం కంటే, శత్రువును పొగడటం ద్వారా అతడిని సొంత గూటిలోనే ఒంటరిని చేసే మోదీ ఎత్తుగడలను రేవంత్ ఎలా తిప్పికొడతారన్నది ఆసక్తికరం.

కాంగ్రెస్ హైకమాండ్ బాధ్యత 

ఇక్కడ అసలైన పరీక్ష రేవంత్ రెడ్డికి కాదు, కాంగ్రెస్ హైకమాండ్‌కే. గతంలో బలమైన నేతలను అనుమానించి, వారిని అవమానించి దూరం చేసుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. ఇప్పుడు రేవంత్ విషయంలో కూడా అదే తప్పు చేస్తే అది కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ అవుతుంది. మోదీ వేసే పాచికల వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహించి, రేవంత్‌ను  రక్షించుకోవాల్సిన సమయం ఇది. రేవంత్‌ను ఏ మాత్రం అనుమానించినా, అది బీజేపీకి రహదారి వేసినట్లే అవుతుంది. కాబట్టి ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సింది రేవంత్ కంటే ఎక్కువగా మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీలే.మోదీ ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో రేవంత్ రెడ్డి ఒక కీలకమైన  పావు  కాదు,  రాజు . ఆ రాజును కాపాడుకోవడం కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లోనే ఉంది. నాయకుల మధ్య అనుమానపు బీజాలు నాటి  కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే మోదీ వ్యూహాన్ని తిప్పికొట్టాలంటే, కాంగ్రెస్ తన అంతర్గత బలాన్ని, నాయకత్వంపై నమ్మకాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి వంటి చురుకైన నాయకుడిని కాపాడుకోలేకపోతే, దక్షిణాదిలో కాంగ్రెస్ కోట బీటలు వారడం ఖాయం.