కొకైన్...ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్రగ్స్ లో ఒకటి. ఇది వ్యక్తులను ఇట్టే తన బానిసలుగా మార్చుకుంటుంది. దీన్ని ఒక్కసారి తీసుకోవడం ప్రారంభిస్తే, మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది. దొరకకపోతే మనుషులు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తారు. అంతకుమించిన వ్యసనాన్ని కలిగించేది మన ఇంట్లో వాడే పంచదార. మనకు తెలియకుండానే దానికి బానిసలుగా మారిపోతాం. యూనివర్సిటీ నిపుణులు చెబుతున్న ప్రకారం చక్కెర, కొకైన్ కంటే ఎక్కువ వ్యసనపరమైనది. తెలియకుండానే చక్కెరను ఇష్టపడడం, అది ఉంటేనే తినడం చేస్తూ ఉంటాము. దీనికి బానిసైన సంగతి కనీసం ఆ వ్యక్తికి కూడా తెలియదు. ఇప్పుడు దాదాపు చాలా ఆహారాల్లో చక్కెర ఉంటుంది.


సిరప్‌లు, తేనెలో కూడా చక్కెరను కలుపుతున్నారు. డోనట్‌లో 14 గ్రాములు చక్కెర ఉంటుంది. డైజెస్ట్ బిస్కెట్లలో కూడా ఐదు గ్రాముల చక్కెర ఉంటుంది. ఈ చక్కెరకు అలవాటు పడితే బరువు పెరగడం, ఊబకాయం, అధిక రక్తపోటు, దంత క్షయం వంటి సమస్యలు వస్తాయి. చక్కెర అధికంగా తీసుకుంటే టైప్2 డయాబెటిస్, గుండెజబ్బులు, కాలేయంలో కొవ్వు చేరడం వంటి ప్రమాదాలు ఉన్నాయి. అలాగే మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. 


చక్కెరకు బానిస అయ్యారా?
చక్కెర తినడం వ్యసనంగా మారినా కూడా అది అసాధారణంగా అనిపించదు. బయట వారికి కనిపించదు చక్కెరకు బానిసైన వ్యక్తి కూడా ఆ విషయాన్ని గ్రహించలేరు.  వీలైనంత ఎక్కువ స్వీట్లు తినాలని కోరిక వారిలో ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంటారు. కేకులు, పంచదార పానీయాలు పొట్టలో వేస్తూనే ఉంటారు. అయినా సరే సంతృప్తి ఉండదు. ఒక స్వీట్ తిన్న తర్వాత మరొక స్వీట్ తినాలన్న కోరిక అధికంగా ఉంటే మీరు చక్కెరకు బానిస అవుతున్నట్టే లెక్క.


చక్కెరకు బానిస అయితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి
1. బరువు పెరగడం 
2. జీర్ణక్రియ నెమ్మదించడం 
3. దంత ఆరోగ్యం క్షీణించడం 
4. మెదడు మొద్దు బారినట్టు అనిపించడం 
5. తరచూ ఆకలి వేయడం 
6. కీళ్ల నొప్పి


పంచదారను ఎంత తక్కువగా తింటే అంత మంచిది. టీలో, కాఫీలో కూడా పంచదార వేసుకోకుండా బెల్లం లేదా తేనె వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. పంచదార తినడం వల్ల హైబీపీ బారిన పడే అవకాశం ఉంది. కాలేయ వ్యాధులు కూడా త్వరగా రావచ్చు. పంచదార ప్రాసెస్ చేసిన ఆహారంలోకి వస్తుంది. దీన్ని తినడం వల్ల అనారోగ్యమే తప్ప, ఆరోగ్యం ఏమీ లేదు. దీన్ని పూర్తిగా తినడం మానేసినా  శరీరానికి జరిగే నష్టమేమీ లేదు. స్వీట్లు తినాలనిపిస్తే పంచదారతో కాకుండా బెల్లంతో చేసిన స్వీట్లను ఎంపిక చేసుకోవాలి.




Also read: మొబైల్ ఎక్కువగా మాట్లాడుతున్నారా? హైబీపీ వచ్చేస్తుంది జాగ్రత్త


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.