శరీరం అంతటా కీలకమైన జీవక్రియను నియంత్రించడానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడమే థైరాయిడ్ గ్రంథి ముఖ్య పని. అది అవసరమైనంతగా హార్మోన్లను ఉత్పత్తి చేయలేనప్పుడు హైపోథైరాయిడిజం సమస్య వచ్చినట్టు చెబుతారు. దీని వల్ల అలసట, విచారంగా ఉండడం, అధికంగా బరువు పెరగడం, ఆహారం తినలేక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని చికిత్స చేయకుండా వదిలేస్తే గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు కూడా రావచ్చు. కొందరికి పిల్లలు కలగకపోవడం కూడా జరుగుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు కచ్చితంగా మందులను వాడాలి. అలాగే ఆహారాన్ని సమతుల్యంగా తీసుకోవడం వల్ల కూడా సమస్య లక్షణాలు తగ్గుతాయి. దీన్ని నియంత్రించాలంటే తీసుకోవాల్సిన కొన్ని పోషకాలు ఉన్నాయి.
అయోడిన్
గుడ్లు, చీజ్, ఉప్పు, పాలు ద్వారా అయోడిన్ మన శరీరానికి అందుతుంది. ఈ అయోడిన్‌ను అధికంగా తీసుకోకూడదు. మితంగా తీసుకుంటే మంచిది. దీన్ని అధికంగా తీసుకుంటే హైపోధైరాయిడిజం వచ్చే అవకాశం ఉంది.
సెలీనియం
చికెన్, ఓట్ మీల్, బ్రౌన్ రైస్, గుడ్లు వంటి వాటిలో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని కూడా సమతుల్యంగా తీసుకుంటే థైరాయిడ్ లక్షణాలు తగ్గుతాయి
జింక్
చిక్కుళ్ళు, పెరుగు, తృణధాన్యాలు, గుమ్మడి గింజలు, చికెన్ వంటి వాటిలో జింక్ పుష్కలంగా లభిస్తుంది. దీన్ని సెలీనియంతో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది. స్త్రీలలో థైరాయిడ్ పనితీరును ఇది మెరుగుపరుస్తుంది.
గోయిట్రోజన్లు
బ్రకోలి, బ్రస్సెల్స్ మొలకలు, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి వాటిల్లో గోయిట్రోజన్లు అధికంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. ఇవి ఉండే కూరగాయలు థైరాయిడ్‌కు ఎంతో ఆరోగ్యకరమైనవి. థైరాయిడ్ పనితీరుపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలను ఇవి చూపించవు.
సోయా
థైరాయిడ్ హార్మోన్లను తయారు చేయడానికి కావాల్సిన సామర్ధ్యాన్ని శరీరానికి అందిస్తుంది సోయా. ఇది థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేస్తుందని. ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. సోయాతో తయారు చేసిన పాలు, టోఫు, సాస్ వంటివి తినడం అలవాటు చేసుకోవాలి.
థైరాయిడ్ మందులను ఖాళీ పొట్టతోనే తీసుకోవాలి. అప్పుడే శరీరం ఆ మందులను పూర్తిగా శోషించుకుంటుంది. రాత్రి భోజనం తర్వాత మూడు నుంచి నాలుగు గంటల తర్వాత లేదా బ్రేక్ ఫాస్ట్ కి 30 నుంచి 60 నిమిషాల ముందు ఈ మందులను తీసుకోవాలి. ఇనుము లేదా కాల్షియం ఉన్న ఆహారాలను తిన్నాక ఈ మందులను వేసుకోకవడమే మంచిది. హైపోథైరాయిడిజంతో బాధపడేవారు ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. హాట్ డాగ్స్, డోనట్స్, కేకులు, కుకీలు, సోడా వంటివి తినకూడదు. అధిక చక్కెర కంటెంట్ ఉన్న ఆహారాలను దూరంగా పెట్టాలి.
Also read: పరగడుపున ఖాళీ పొట్టతో చెరుకు రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Also read: సీనియర్ ఎన్టీఆర్‌కు ఇడ్లీలంటే ఎంత ఇష్టమో, ఆయన మెనూలో ఉండే ఆహారాలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.