తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో తెలుగు ప్రజల్లో పౌరుషాన్ని రగిల్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు. తెలుగు  దేశం పార్టీని స్థాపించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కూడా కారణమయ్యారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మొదటి సూపర్ స్టార్ ఆయనే. సమయపాలనలో ఆయన తరువాతే ఎవరైనా. ఆహారం విషయంలో కూడా అంతే సమయానికి టిఫిన్, స్నాక్స్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం పూర్తి చేయాల్సిందే. అందులో ఉండాల్సిన పదార్థాలను ఆయన నిర్ణయించే వారు. ఆయన ఆహారపు అలవాట్ల గురించి ఇప్పటికే ఎంతో మంది చెప్పుకుంటూ ఉంటారు. ఆయన భోజన ప్రియుడు. 


ఇడ్లీలంటే ఎంతిష్టమో...
రోజూ టిఫిన్లో భాగంగా ఇడ్లీలనే తినే వారు ఎన్టీఆర్. ఉదయం ఆరు గంటల కన్నా 10 నుంచి 15 ఇడ్లీలు తినేవారు. ఆ ఇడ్లీలు ఇప్పటి ఇడ్లీల్లా చిన్నవి కావు. మందంగా అరచేయంత ఉండేవట. ఇడ్లీలను నాటు కోడి కూరతో తినేవారు. మళ్లీ 10 గంటలకు అయిదు ఇడ్లీలు తినేవారు. యాపిల్ జ్యూస్ ను ఇష్టంగా తాగేవారు. రోజుకు లీటరు యాపిల్ జ్యూస్ తాగేవారని అంటారు. షూటింగ్ మధ్యలో ఖాళీ దొరికినప్పుడు యాపిల్ జ్యూస్ తాగేవారు. అలాగే వేసవిలో మామిడి పళ్ల రసాన్ని గ్లూకోజ్ పొడి కలుపుకుని తాగేవారు. వేసవిలో బాదం పాలు కూడా అధికంగా తాగేవారు. 


మధ్యాహ్న భోజనంలో...
ఎన్టీయార్ మధ్యాహ్న భోజనంలో అన్నమే తినేవారు. రెండు కూరలు కచ్చితంగా ఉండాలి. పెరుగు, రసం, అప్పడం కూడా ఉండాల్సిందే. ఆయనకు నాటు కోడి కూర అంటే చాలా ఇష్టం. దాన్ని రోజూ పెట్టినా తినేవారు. ఇక సాయంత్రం స్నాక్స్ లో భాగంగా బజ్జీలు తినేవారు. ఆయన ఒక్కరే 10 నుంచి 15 బజ్జీలు అలవోకగా తినేసేవారు. అలాగే మధ్యమధ్యలో డ్రైప్రూట్స్ కూడా తినేవారు. చెన్నైలో షూటింగ్ ఉంటే మధ్యాహ్నం కచ్చితంగా భోజనానికి ఇంటికి వెళ్లేవారు. 


చెన్నై మౌంట్ రోడ్ లోని ‘బాంబే హల్వా హౌస్’ షాప్ నుంచి మాత్రమే డ్రై ఫ్రూట్స్, బాదం పాలు తెప్పించుకునేవారు. చెన్నైలో కూడా బజ్జీలు ఎక్కడ బాగుంటాయో ఆయన నిర్మాతకు చెప్పి మరీ తెప్పించేవారట. మాగాయ్ పచ్చడి అన్నా కూడా సీనియర్ ఎన్టీఆర్ కు చాలా ఇష్టం. నిమ్మకూరు నుంచి బంధువులు తయారు చేసిన మాగాయ్ పచ్చడిని తెప్పించేవారు. షూటింగ్ సెట్లో అందరికీ దాని రుచి చూపించేవారు. 


నందమూరి తారక రామారావు 1923, మే 28న నిమ్మకూరులో జన్మించారు. అతనికి మొదట కృష్ణ  అని పేరుపెట్టాలనుకున్నారు. కానీ మేనమామ తారక రాముడు అని పెట్టమని సూచించారు. దీంతో అదే పేరును పెట్టారు. విజయవాడ మునిసిపాలిటీ స్కూల్లోనే ఎన్టీఆర్ చదువుకున్నారు. అతనికి 20 ఏళ్ల వయసులోనే బసవతారకంతో పెళ్లి అయింది. వీటిని 11 మంది పిల్లలు కలిగారు. వీరిలో ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. అతను నటించిన సినిమా మనదేశం తొలిగా 1949లో విడుదలైంది. అదే ఆయన తొలిసినిమా. 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీని స్థాపిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. చైతన్య రథంపై ‘తెలుగు దేశం పిలుస్తోంది, రా... కదలి రా’ అనే నినాదంతో ముందుకు సాగారు. అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చింది చరిత్ర  సృష్టించారు.