వెన్ను లేదా నడుము నొప్పిగా అనిపిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోలేరు, నిలబడి ఉండలేరు. చాలా మంది దీన్ని తేలికగా తీసుకుంటారు కానీ ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి ప్రధాన కారణం వెన్ను నొప్పి. ఏదైనా గాయం లేదా అంతర్లీన పరిస్థితుల కారణంగా ఇది సంభవించవచ్చు. వెన్ను నొప్పి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే అది మరింత తీవ్రమవుతుంది.
వెన్ను నొప్పి ఎక్కువగా వచ్చే ప్రాంతాలు
- స్నాయువులు, కండరాలు
- డిస్క్
- నరాలు
- కిడ్నీకి దగ్గర ఉన్న అవయవాలకి సంబంధించిన సమస్య వల్ల కూడా వెన్ను నొప్పి వస్తుంది.
వెన్నునొప్పి సంకేతాలు
కండరాల నొప్పి, వెన్నులో వేడి సెగలు లేదా మంట, సూదులతో గుచ్చినట్లుగా అనిపించడం వరకు ఉంటాయి. ఇది కాలు కిందకి కూడా వ్యాపిస్తుంది. వంగడం, బరువు ఎత్తలేకపోవడం, నిలబడటం, నడవలేకపోవడం వంటి పరిస్థితి కూడా రావచ్చు. కొన్ని వారాల కంటే ఎక్కువ కాలం ఈ నొప్పి ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నా కూడా నొప్పి తగ్గదు. నొప్పి ఎక్కువగా ఉంటే కాళ్ళకి వ్యాపిస్తుంది. తిమ్మిర్లు, జలదింపుగా అనిపిస్తుంది. బరువు తగ్గుతారు. పేగు లేదా మూత్రాశయ సమస్యలకి కారణంఅవుతుంది. జ్వరం కూడా వస్తుంది.
సహజంగా వెన్నునొప్పి ఎలా నయం చేయాలి?
విపరీతమైన నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి వెన్నునొప్పికి శస్త్ర చికిత్స చేస్తారు. లేదంటే మందుల ద్వారా నయం చేయవచ్చు. శస్త్రచికిత్స అవసరం లేకుండా కూడా సహజమైన పద్ధతుల్లో నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
వేడి లేదా చల్లని నీటితో ప్యాక్
వెన్ను నొప్పి నుంచి బయటపడేందుకు వాపుని తగ్గించుకునేందుకు వేడి లేదా ఐస్ ప్యాక్ తో కాసేపు మర్దనా చేసుకోవచ్చు. అయితే ఐస్ ని నేరుగా శరీరం మీద పెట్టకూడదు. పల్చని టవల్ లో వాటిని వేసుకుని మర్దన చేసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. వెన్నులో మంట ఎక్కువగా అనిపిస్తే వేడి నీటితో కూడా మర్దన చేసుకోవచ్చు.
వ్యాయమాలు
నొప్పిని తగ్గించుకునేందుకు కొన్ని రకాల వ్యాయామాలు కూడా సహాయం చేస్తాయి. వీటి వల్ల ఉదర కండరాలని బలోపేతం చేస్తాయి. నిపుణులు సూచించిన విధంగా వ్యాయామం చేయడం వల్ల కండరాలు సాగుతాయి.
నూనెలు రాయడం
సహజ పదార్థాలతో చేసిన నూనెలు లేదా లేపనాలు కూడా నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. క్యాప్సైసిన్ అనే పదార్థం ఉన్న నూనెలు వేడి చేసుకుని రాసుకోవడం వల్ల ప్రభావవంతంగా పని చేస్తుంది.
మెడిటేషన్
ఏకాగ్రతని మెరుగుపరిచి మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు లేదా ఎండార్ఫిన్‌లను విడుదల చేయడానికి, ఆందోళన, ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం ఒక గొప్ప మార్గం. ఇది పాటించడం వల్ల నొప్పిని నియంత్రించుకోవచ్చు.
నిద్ర
నిద్రలేమి ప్రధాన కారణాల్లో వెన్ను నొప్పి ఒకటి. నొప్పి కారణంగా నిద్ర పోవడం కష్టం అవుతుంది. కంటికి సరిపడా నిద్ర లేకపోయినా కూడా వెన్నునొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది.
మసాజ్
నొప్పి ఉన్న చోట కండరాలపై సున్నితంగా మసాజ్ చేయడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు. ఇది నొప్పిని తగ్గించడం మాత్రమే కాదు వెన్ను పనితీరుని మెరుగుపరుస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.