మహిళల జీవిత కాలం ఆధారంగా ఇటీవలి కాలంలో జరిపిన ఓ అధ్యయనంలో ఓ షాకింగ్ విషయం తెలిసింది. పురుషుల ఆరోగ్యం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నట్లు తేలింది.  కొడుకు, భర్త, తండ్రి వంటి బాధ్యతల నడుమ బతుకుతున్న పురుషుల జీవిత కాలం వేగంగా క్షీణిస్తోందట. బాలికలు, మహిళలతో పోలిస్తే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు బాలురైనా, పురుషులైనా తక్కువ ఆరోగ్యవంతులుగా ఉన్నారట. అంతేకాదు వేగంగా మరణం వైపు పయనించే ప్రమాదం కూడా ఉందట.


2021 USA డేటా ప్రకారం మహిళల ఆయుర్ధాయం 79.1 సంవత్సరాలు కాగా.. పురుషుల ఆయుర్ధాయం 73.2 గా ఉంది. పావు శతాబ్ధ కాలంలో ఈ అంతరం చాలా పెరిగిందని ఈ డేటా చెబుతోంది. ఇది కేవలం యూఎస్‌కు మాత్రమే పరిమితమైన విషయంకాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆలోచించాల్సిన విషయం. పురుషుల ఆరోగ్య నాణ్యత దిగజారుతోంది. అందువల్ల అకాల మరణానికి కారణమైయ్యే కారణాల గురించి ఆలోచించాల్సిఉంది. పురుషుల ఆయుర్దాయం పెంచేందుకు మహిళల దీర్ఘాయువు‌కు గల కారణాలను తెలుసుకొనేందుకు మరింత లోతైన పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది.



  • డయాబెటిస్ కారణాలతో మరణించే ప్రమాదం స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువ.

  • కోవిడ్ సంబంధిత దుష్ప్రభావాలతో మరణించేవారిలో పురుషులే ఎక్కువ.

  • ప్రతి లక్ష మంది కోవిడ్ పేషెంట్లలో 140 మంది పురుషులు మరణించగా, స్త్రీలు కేవలం 87.7 మంది మాత్రమే కోవిడ్ కారణంగా మరణించారు.

  • 10 -19 సంవత్సరాల మధ్య వయసు టీనేజి పిల్లల్లో కూడా బాలికల కంటే బాలుర మరణాలు ఎక్కువ.

  • ఇక శిశువుల్లో ఆడ శిశువుల కంటే మగ శిశువుల మరణాలు చాలా ఎక్కువ.

  • అంతేకాదు క్యాన్సర్ వల్ల సంభవించే మరణాలు కూడా పురుషుల్లోనే ఎక్కువ.

  • పురుషులు వారి మానసిక ఆరోగ్యం గురించి కూడా పెద్దగా పట్టించుకోరు. అందుకే ఆత్మహత్యల్లో కూడా పురుషులే ముందున్నారు. 

  • 2020 డేటా ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో సైతం పురుషుల మరణాలే ఎక్కువగా ఉన్నాయట.


కారణాలు


స్త్రీల దీర్ఘాయువు వెనుకున్న కారణాలు పూర్తిగా తెలియలేదు. కానీ, జీవశాస్త్ర సంభావ్యతలే ఇందుకు ప్రధాన కారణం అనిచెప్పవచ్చు. టెస్టోస్టిరాన్ స్థాయిలు పురుషుల నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తాయనేది కూడా ఒక కారణం. అందువల్ల వీరిలో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు స్త్రీలలోని ఈస్ట్రొజన్ వారిని హర్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక ప్రమాదల నుంచి కాపాడుతుంది. అందుకే మెనోపాజ్ తర్వాత స్త్రీలలో కూడా మరణాల రేటు పెరుగుతుంది. పురుషుల్లో ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి దాని మూలంగా గుండె జబ్బుల నుంచి రక్షణ లభించలేదని నిపుణులు నిర్ధారిస్తున్నారు.


అంతే కాదు, పురుషులు బలమైన వారనే భావన దాదాపు అన్ని సంస్కృతుల్లోనూ బలంగా పాతుకుపోయి ఉంది. వారికి పెద్దగా అనారోగ్యాలు ఉండవని వైద్య సహాయం కూడా అవసరం లేదనే ఆలోచనలో ఉంటారు. అందువల్ల వారు అనారోగ్యాలను నిర్లక్ష్యం చేస్తుండడం ఒక కారణం. ఇలాంటి ఒక సోషల్ సినారియో వారు త్వరగా వైద్య సహాయం తీసుకోవడం, నిపుణుల సలహా కోసం వెళ్లడంలో జాప్యం చెయ్యడం వంటి కారణాలు కూడా వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉండేందుకు ఒక కారణం. ఇలాంటి జాప్యం ఒక్కోసారి ప్రాణాపాయం కలిగిస్తుంది.


ఇలా రకరకాల ఫిజియోలాజికల్, సోషల్, సైకలాజికల్ కారణాలతో దీర్ఘాయుష్షు విషయంలో పురుషులు స్త్రీల కంటే వెనుకబడి ఉన్నారని కొత్త అధ్యయనం చెబుతోంది. కనుక పురుషులు ఇక నుంచి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తోంది.


Also Read: ఓ మై గాడ్, ఇయర్ ఫోన్స్‌తో అంత డేంజరా? షేర్ చేసుకున్నా ప్రమాదమేనట!