Mediterranean Diet for Weight Loss : బరువు తగ్గేందుకు వ్యాయామంతో పాటు డైట్ చాలా ముఖ్యం. తీసుకునే ఆహారం వల్లే చాలామంది బరువు తగ్గుతారు. సరైన ఫుడ్స్ తీసుకుంటూ.. అవసరం లేని ఫుడ్స్‌కి దూరంగా ఉంటే బరువు తగ్గుతారనేది నిజం. అందుకే మార్కెట్లో వివిధ రకాల డైట్స్ ప్రాచూర్యం పొందుతున్నాయి. అయితే మీరు కూడా ఇలాంటి డైట్లు ట్రై చేస్తున్నవారే అయితే బరువు తగ్గడానికి మెడిటరేనియన్ డైట్ బెస్ట్ ఆప్షన్ అంటోన్నారు నిపుణులు. అసలు ఈ డైట్ ఏంటో.. దీనివల్ల కలిగే లాభాలా ఏంటో చూసేద్దాం.
టేస్టీగా, ఫాలో అవ్వడానికి వీలుగా, తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది మెడిటరేనియన్ డైట్. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ డైట్ ఉత్తమ ఆహారాల జాబితాలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఎందుకంటే ఈ డైట్ ఫాలో అవ్వడం బరువు తగ్గడానికి హెల్ప్ చేసిందని గణనీయమైన ఆధారాలు ఉన్నాయి. న్యూట్రిషన్ అండ్ డయాబెటిస్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. 32వేలమంది 12 సంవత్సరాల పాటు మెడిటరేనియన్ డైట్ ఫాలో అవ్వగా.. వారిలో అధిక బరువు, ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గినట్లు కనుగొన్నారు.
ది అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసన్, ది బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో కూడా ఈ మెడిటరేనియన్ డైట్ గురించి ప్రస్తావించారు. లోకార్బ్ డైట్ వంటి వాటితో పోల్చినప్పుడు ఈ డైట్ ఫాలో అయిన వారిలో రెండు రెట్లు ఎక్కువగా బరువు తగ్గే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ డైట్లో తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి? తినకూడని ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెడిటరేనియన్ డైట్
ఈ డైట్లో తాజా, రుచికరమైన ఆహారాలనే ఎక్కువగా తీసుకుంటారు. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ ఈ డైట్లో భాగమవుతాయి. కొవ్వు చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇవన్నీ బరువు తగ్గడానికి అనువైనవి.
డైట్లో భాగంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే
మెడిటరేనియన్ డైట్లో భాగంగా.. బాదం, పిస్తాపప్పులు, వాల్నట్స్, అవిసెగింజలు, అంజీర్, ఖర్జూరం, చియాసీడ్స్ చేర్చుకోవాలి. సాల్మన్, ట్యూనా, మాకేరల్, రొయ్యలు, పీత, ఆక్టోపస్, చేపలు, సీ ఫుడ్, చికెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆకుకూరలు, టమోటాలు, దోసకాయలు, బ్రోకలీ, బీన్స్, చిక్కుళ్లు వంటి కూరగాయలు తినొచ్చు. సిట్రస్, బెర్రీలు, ఆపిల్, ద్రాక్ష పండ్లు తినాలి. మిల్లెట్స్, క్వినోవా, ఓట్స్ కూడా చేర్చుకోవచ్చు. మొక్కల ఆధారిత నూనెలు, ఆలివ్‌నూనెతో వంట చేసుకుంటే మంచిది. పాల ఉత్పత్తులు లిమిటెడ్‌గా తీసుకోవచ్చు.
తినకూడని ఫుడ్స్ ఇవే
మెడిటరేనియన్ డైట్లో బరువు పెరగడానికి కారణమయ్యే ఆహారాలు తీసుకోకూడదు. ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోకూడదు. ప్రాసెస్ చేసిన ధాన్యాలు, మైదా పిండి, రైస్, వైట్ పాస్తా తినకూడదు. అలాగే వెన్న, రెడ్ మీట్ వంటి అధిక కొవ్వు ఉండే ఫుడ్స్ తీసుకోకూడదు.
ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ డైట్‌ని ఫాలో అవ్వొచ్చు. యూఎస్‌లో వైద్యులు దీనిని ఆమోదిస్తున్నారు. డాక్టర్ వాలెస్ ప్రకారం ఇతర డైట్ల మాదిరిగా వీటిలో ఫుడ్ రిస్ట్రక్షన్ ఉండదు. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించగలుగుతారు. ఆరోగ్యంగా బరువు తగ్గడంలో ఇది హెల్ప్ చేస్తుంది.. అని చెప్పారు.
పేగు సంబంధిత వ్యాధులు, మూత్రపిండి వ్యాధులు, కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కొందరికి ఇబ్బంది ఉండొచ్చని.. అలాగే పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు పరిమితం చేయాలని.. కొన్నిరకాల పండ్లు, కూరగాయలు కొందరికి ఇబ్బందిని కలిగిస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అయితే మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. వైద్యులు లేదా నిపుణుల సూచనలు తీసుకుని ఈ డైట్ స్టార్ట్ చేయవచ్చు.