Rajahmundry Railway Station Works : గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఘాట్‌లను సుందరీకరిస్తున్నారు. ప్రజలు వచ్చి పుణ్య స్నానాలు చేసి సురక్షితంగా తిరిగి వెళ్లేందుకు రహదారులను కూడా విస్తరిస్తున్నారు. అయితే అన్నింటి కంటే ముఖ్యమైన రైల్వే స్టేషన్ పునఃనిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అధునాత సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం నుంచి నిధులు మంజూరు అయినప్పటికీ వర్క్స్‌ మాత్రం టెండర్ దశ దాటి వెళ్లడం లేదు. 

రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని కేంద్రం భావించింది. అందుకే అమృత్‌ భారత్‌స్టేషన్‌ పథకంలో చేర్చారు. గతంలో ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా పనులకు శంకుస్థాపన చేశారు. అయితే భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మరికొన్ని విస్తరణ పనులు చేస్తే ప్రయోజనం ఉంటుందని స్థానిక నాయకులు చెప్పడంతో పనులను రీడిజైన్ చేశారు. దీంతో మొత్తానికి పనులు ఆగిపోయాయి. 

స్టేషన్‌ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే రైల్వే మంత్రిత్వ శాఖ 271.43 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడంతో పనులు ఊపందుకుంటాయని అంతా అనుకున్నారు కానీ టెండర్లు దశ దాటి వెళ్లడం లేదు. పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలని ఈ మధ్య రైల్వే అధికారులను రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి కలిసి రిక్వస్ట్ చేశారు. టెండర్లు ఖరారు చేసి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రస్తుతం రోజుకు 35 వేల మంది ఈ స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే గంటలకు దాదాపు పది వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 

పశ్చిమ భాగంలో కొత్తగా జీ +3 బిల్డింగ్ నిర్మించాలి. తూర్పు వైపు కూడా జీ+5 భవన నిర్మించారు. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలా ప్లాట్‌ఫామ్‌లు నిర్మించాల్సి ఉంది. 17 ఎస్కలేటర్లు, ఏడు లిప్టుల నిర్మాణం జరగాల్సి ఉంది. ఫుడ్‌ ప్లాజాలు, ఇతర దుకాణాలకు నిర్మాణాలు చేపట్టాలి. రెండు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కట్టాలి. పార్కింగ్‌ సౌకర్యాలు అభివృద్ధి చేయాలి. ఇలా చాలా పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటి నుంచి వీటిని ప్రారంభించకుంటే పుష్కరాల కాలం నాటికి పూర్తి కావని స్థానిక ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు. అందుకే కచ్చితంగా  ప్రారంభించేలా అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు.