ఈ మధ్య చాలా మందికి నిద్రకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ఇందుకు మన జీవన విధానమేనని వైద్య నిపుణులు అంటున్నారు. అప్పుడప్పుడు నిద్ర పట్టకపోవడం అనేది సహజమే. కానీ తరచుగా నిద్రపట్టడం లేదంటే మాత్రం అది రకరకాల అనారోగ్యాలకు కారణం కావచ్చని సైకలజిస్ట్ అండ్ మెంటల్ హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.


తరచుగా నిద్ర తగ్గితే ఏకాగ్రత కుదరక పోవడం, చికాకుగా ఉండడం, మూడ్ స్వింగ్స్ వంటివి ఏర్పడతాయి. మీలో మానసిక సమస్యలు మొదలవుతున్నాయి అనడానికి నిద్ర పట్టకపోవడం కూడా ఒక లక్షణమే. రోజుకు కనీసం 6 నుంచి 9 గంటల నిద్ర కచ్చితంగా అవసరమని నిపుణులు చెబుతున్నారు. మరి దాన్ని మీరు పాటిస్తున్నారా? లేకపోతే.. ఈ కింది అలవాట్లే మీ నిద్రకు విలన్స్. ఇవన్నీ మానుకుంటే.. మీరు రోజూ హాయిగా నిద్రపోవచ్చు.


సెల్ ఫోన్ వినియోగం


పడుకునే ముందు పోన్ వాడడం అనేది చాలా తప్పు. మంచం మీదకు చేరిన తర్వాత ఫోన్ ఉపయోగించకూడదు. నిజానికి పడుకోవడానికి 30 నిమిషాల ముందు నుంచే ఫోన్ చూడడం ఆపాలి. ’’ఫోన్ మాత్రమే కాదు, లాప్టాప్, ట్యాబ్, ఎల్‌‌‌‌‌ఈడీ టీవీలు.. ఇలా బ్లూలైట్ ఉండే గాడ్జెట్‌లు ఏవీ వినియోగించకూడదు. ఈ బ్లూ లైట్ మెదడును చురుకుగా ఉంచుతుంది. అందువల్ల మెలటోనిన్ తగ్గి నిద్ర త్వరగా రాదు.’’ అని రాబర్ట్ వివరించారు.


కునుకు తియ్యడం


వీలైనప్పుడల్లా కునుకు తియ్యడం మంచి ఆలోచన లాగ అనిపించవచ్చు. కానీ రాత్రి పూట మంచి నిద్ర పోవాలనుకుంటే ఇలా కునుకు తియ్యడం మానేయ్యాలి. చాలా మంది పిల్లలను మధ్యాహ్నం కునుకు తియ్యకుండా జాగ్రత్త పడతారు. రాత్రి పూట నిద్రకు ఇది భంగం కలిగిస్తుందని ఈ జాగ్రత్త తీసుకుంటారు. ఇది పెద్దలకు కూడా వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తప్పనిసరిగా మధ్యాహ్నం కునుకు అవసరమయ్యే వారు 30 నిమిషాలకు మించకుండా చూసుకోవాలి. అది కూడా సాయంత్రానికి ముందు కాకుండా జాగ్రత్త పడాలి.


మంచం మీద వేరే పనులు చెయ్యడం


మంచం మీద పడుకుని లాప్టాప్ లో నెట్ ఫ్లిక్స్ చూడడం చాలా మందికి నచ్చుతుంది. కానీ ఇది అసలు మంచిది కాదట. టీవీ చూడడం, లాప్టాప్ లో పనిచెయ్యడం వంటి వాటికి మంచాన్ని అసలు వాడకూడదని నిపుణుల సలహా. మంచం విశ్రాంతికి మాత్రమే ఉపయోగించడం వల్ల మంచంలోకి చేరగానే మెదడుకు ఇది నిద్రించే సమయం అనే సంకేతం వెళ్తుంది. ఫలితంగా త్వరగా నిద్రపోతారు.


వ్యాయామం


వ్యాయామం తప్పనిసరి ఆక్టివిటి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చెయ్యాల్సిందే. అయితే అందుకు సమయపాలన కూడా చాలా ముఖ్యం. నిద్రకు ముందు వ్యాయామం చెయ్యడం వల్ల శరీరం చురుకుగా మారి నిద్ర పట్టడం సమస్యగా మారొచ్చు. కనుక రాత్రి పూట వ్యాయామం అంత మంచిది కాదనే నిపుణులు సలహా ఇస్తున్నారు.


క్రమశిక్షణ


రోజువారీ చేసుకునే పనుల్లో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి. షెడ్యూల్ కు కట్టుబడి పనులు పూర్తి చేసుకోవడం మంచిది. సరైన దిన చర్య అనేది మంచి నిద్రకు అవసరం. సిర్కాయిడ్ రిథమ్ ను బలోపేతం చేస్తుంది. రోజూ ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించడం, ఒకే సమయానికి నిద్ర మేల్కొనడం ఎప్పుడైనా మంచిదే అది వీకెండ్ అయినా మంచిదే.


నిద్రపోవడానికి కష్ట పడుతుంటే ధ్యానం చెయ్యడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మెడిటేషన్ వల్ల ఆలోచనలు తగ్గి మనసులో కామ్ నెస్ వస్తుంది. శ్వాస సంబంధించిన వ్యాయామాలు కూడా మంచి నిద్రకు దోహదం చేస్తాయి.


Also read: జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు అసలు చేయొద్దు, చాలా ప్రమాదం