కుడి చేతితో అన్ని పనులు చేసుకోవడం పరిపాటి. ఇంకా చెప్పాలంటే శుభప్రదం. ఎడమ చేతితో ఏదైనా పని చేస్తే అశుభం అంటారు. కొంత మందైతే ఎడమ చేతి మంచినీళ్లు ఇచ్చినా తీసుకోరు. అయితే మనలో కొందరు ఎడమ చేతి వాటంవాళ్లు ఉంటారు. వీరు అన్ని పనులకు ఎడమ చెయ్యినే ఎక్కువగా వాడుతారు. కొంత మంది రెండు చేతులను సమానంగా వాడగలరు. అది వేరే సంగతి. కొంతమంది కుడి చేతితో పనులు సరిగ్గా చెయ్యలేరు. కేవలం ఎడమ చెయ్యి మాత్రమే వాడగలరు. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం అలవాటేనా? లేక ఇంకేదైనా కారణం ఉందా? ఇక్కడ తెలుసుకుందాం.


ఎడమ చేతితో పనిచేసే వారిని పాపులుగా చూస్తారు కొన్ని నాగరికతల్లో. అదృష్టం కొద్ది సౌత్ ఆఫ్రీకాకు చెందిన ‘‘ఇంకా’’ వంటి పురాతన నాగరికతల్లో వీరి విషయంలో కొంచెం ప్రత్యేకంగానే ఆలోచిస్తారు. అంతేకాదు ఎడమచేతి వాటం వారికి ఏవో ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయన్న నమ్మకం కూడా ఉంది. ఇక నార్త్ అమెరికన్ జూనీ తెగలో ఎడమ చేతి వాటం వారు అదృష్ట వంతులని అంటుంటారు. అన్నింటికి మించి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎడమ చేతి వాటం కలిగి ఉండడంలో ఎలాంటి తప్పు లేదనేది మాత్రమే.


ఎడమ చేతితో పనిచేసేవారు కాస్త అరుదైన మనుషులు. ఎందుకంటే పది మందిలో ఒక్కరు మాత్రమే ఎడమ చేతి వాటం కలిగి ఉంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఒక క్లాస్ లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు బాల్ విసరడానికో, రాయడానికి, బొమ్మలు వెయ్యడానికి ఎడమ చేతిని ఉపయోగించే వారు ఉంటారు. దీన్నిబట్టి మానవ చరిత్రలో అనాదిగా కుడి చేతినే ఎక్కువగా ఉపయోగించారని అర్థం అవుతోంది. అందుకే, మనలో ఎక్కువ మంది కుడిచేతితో పనిచేస్తారు. మన పూర్వీకులు రాళ్లు విసరడం, పండ్లు సేకరించడం వంటి అనేక పనులకు ఏడు మిలియన్ల సంవత్సరాలుగా కుడి చేతినే వాడటం మానవులకు అలవాటైంది. 


ఎందుకు ఒకటే చెయ్యి వాడుతారు?


చేతులు రెండు ఒకేలా ఉంటాయి. కానీ, ఒక చేయి చేసిన పని రెండో చేయ్యి చేయ్యలేదు. రాయడం, బొమ్మ గీయడం, లేదా ఇంకేదైనా పని చెయ్యడంలో ఒక చేయి మాత్రమే మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది. ఒకే చేతిని ఒక పని చెయ్యడానికి వాడుతుండడం వల్ల బ్రెయిన్ కూడా అలా ట్యూన్ అయిపోతుంది. అదే పదేపదే ఒక పనిచెయ్యడానికి చేతిని మారుస్తూ పోతే ఆ పని నేర్చుకోవడానికి బ్రెయిన్ కు ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల బ్రెయిన్ ఒకే చేతితో పని చెయ్యమని సజెషన్స్ ఇస్తుంది. బాల్ తన్నడానికి కూడా ఒక పర్టిక్యులర్ కాలునే ఉపయోగించడానికి కూడా ఇదే కారణం.


ఏదైనా ఒక పనిని చేసేందుకు ఏచేతిని వాడాలి అనే విషయం కేవలం కాళ్లు, చేతులు, కళ్లకు సంబంధించిన విషయం కాదు. ఈ విషయాన్ని నిర్ణయించేది బ్రెయిన్ అన్నమాట. మానవ బ్రెయిన్ రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి కుడి వైపు మెదడు, రెండోది ఎడమవైపు మెదడు. మాట్లాడే సామర్థ్యం, పెయింటింగ్, గణితం వంటివి నేర్చుకునే సామార్థ్యం వంటి వాటన్నింటిని బ్రెయిన్ లోని ఒక వైపు భాగం నిర్ణయిస్తుంది. సాధారణంగా మాట్లాడే సామర్థ్యాన్ని నిర్ణయించే మెదడు భాగమే మీరు రాయడం లేదా బొమ్మ గీయడం లేదా బాల్ విసరడం వంటి వన్నీంటిని నిర్ణయిస్తుంటుంది. అంటే మీరు మాట్లాడే సామర్థ్యాన్ని మెదడులోని ఎడమ భాగం నిర్ణయిస్తే మీరు సాధారణంగా కుడిచేతి వాటం కలిగి ఉంటారు. ఇలా చేతివాటానికి మెదడు పనితీరుకి సంబంధం ఉంటుందన్న మాట.


ఎలా చేతి వాటం నిర్ణయం అవుతుంది?


ఏ చేతిని వాడాలి అనేది నిజానికి మన చేతిలో ఉండే విషయం కాదు. కొన్ని సార్లు ఇది జెనెటికల్ గా మీ పూర్వికుల నుంచి సంక్రమిస్తుంది. ఐడెంటికల్ ట్విన్స్ లో దాదాపు జీన్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. అయినా సరే వారిలో చేతివాటాల్లో తేడా ఉండొచ్చనేది చాలా ఆసక్తికరమైన విషయం.


తమ పిల్లలు ఏ చేతి వాటం కలిగి ఉన్నారో తెలియడానికి  రెండు సంవత్సరాల సమయం పట్టిందని చాలా మంది పేరెంట్స్ అంటున్నారు. అయితే శాస్త్రవేత్తలు పిల్లలు పుట్టక ముందే వారు ఏ చేతి వాటం కలిగి ఉంటారో సరిగ్గా అంచనా వేయగలరట. ఏది ఏమైనా ఎడమ చేతి వాటం కలిగిన వారు ప్రపంచ వ్యాప్తంగా జనాభాలో 10 శాతం ఉంటారనేది వాస్తవం.



Also Read: చిలగడదుంపతో బరువు తగ్గొచ్చు, తొక్కతో కలిపి తింటే బోలెడు ప్రయోజనాలు