Brain And Cigarettes: ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వాలు ఎంతగా చెబుతున్నా, వాటిని కాల్చే వారి సంఖ్య పెరుగుతుందే గాని తరగడం లేదు. సిగరెట్లు కాల్చే వారిలో క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం అధికంగా ఉంటుంది. ఇంతకాలం ధూమపానం చేయడం వల్ల ఊపిరితిత్తులకు చాలా ప్రమాదం అని వైద్యులు చెబుతుండేవారు, అయితే కేవలం ఊపిరితిత్తులకే కాదు మెదడు కూడా దెబ్బ తినే ప్రమాదం ఉందని కొత్త అధ్యయనం చెబుతోంది. ప్రతిరోజూ ధూమపానం చేసేవారిలో మెదడు పరిమాణం తగ్గుతూ ఉంటుందని వివరిస్తున్నారు అధ్యయనకర్తలు.
రోజూ ధూమపానం చేసే వారి మెదడు, ధూమపానం చేయని వారి కంటే 0.4 క్యూబిక్ అంగుళాలు చిన్నదిగా ఉన్నట్టు కొత్త పరిశోధన చెబుతోంది. దీని కోసం శాస్త్రవేత్తలు పెద్ద అధ్యయనానన్ని నిర్వహించారు. ధూమపానం అలవాటు ఉన్న వ్యక్తుల మెదడును స్కాన్ చేసి విశ్లేషించారు. ఈ పరిశోధనలో భాగంగా 2006 నుంచి 2010 వరకు 2012 నుంచి 2013 వరకు మధ్య సర్వేలను పూర్తి చేశారు. 2006 నుంచి 2010 ధూమపానం చేసేవారి మెదడును స్కాన్ చేసి పరిమాణాన్ని గుర్తించారు. తర్వాత 2012 నుంచి 2013లో చేసిన అధ్యయనంలో కూడా మెదడును స్కాన్ చేశారు. ఈ సర్వేలో ధూమపానం చేయని వారి కంటే, ధూమపానం చేసే వారిలో మెదడు పరిమాణం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ధూమపానం చేయని వారి మెదడు పెద్దగా ఉన్నట్టు కనుగొన్నారు. అంటే సిగరెట్ కాల్చడం వల్ల మెదడు కుచించుకుపోతుంది అని చెప్పవచ్చు.
మెదడులో ఒక్కో భాగం ఒక్కో రకమైన పనిని నిర్వర్తిస్తుంది. అలా మనకు భావోద్వేగం, జ్ఞాపకశక్తిని అందించే మెదడులోని భాగం ధూమపానం వల్ల సంకోచిస్తున్నట్టు గుర్తించారు అధ్యయనకర్తలు. ఇప్పటికీ కూడా మించిపోయింది ఏం లేదు, ధూమపానం అలవాటును మానేస్తే ఏడాదిలో మళ్ళీ మెదడు పెరగడం మొదలవుతుంది. కాబట్టి ధూమపానం అలవాటు ఉన్నవారు దాన్ని వదిలేయడం చాలా మంచిది.
మెదడు సంకోచం అంటే?
మస్తిష్క క్షీణత లేదా మెదడు కుచించకపోవడం అనేది వయసు మీరిన వారిలో కనిపిస్తుంది. కానీ ధూమపానం వల్ల యువతలో కూడా ఈ సమస్య మొదలవుతుంది. ఈ సమస్య వల్ల కండరాలు బలహీనంగా మారుతాయి. దృష్టి మసకబారుతుంది. గందరగోళంగా అనిపిస్తుంది. శరీర అవయవాల మధ్య సమన్వయం కోల్పోతుంది. అంటే మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
శాశ్వతంగా ధూమపానం ఇలా మానేయండి?
ధూమపానం మానేయడానికి దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. మానసికంగా, శారీరకంగా ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. సిగరెట్ లేకుండా జీవితం సంతోషంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ధూమపానాన్ని మానేయడానికి నికోటిన్ ప్యాచెస్ వాడడం మొదలు పెట్టండి. వీటిని నమలడం వల్ల సిగరెట్ తాగాలన్న ఆసక్తి ఉండదు. వ్యాయామం అధికంగా చేయండి. ధూమపానం చేసే స్నేహితులకు దూరంగా ఉండండి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజులకు లేదా కొన్ని నెలలకు సిగరెట్ కాల్చడం మానేయవచ్చు.
Also read: మా పనిమనిషి పెళ్లి చేసుకున్న పద్ధతి నాకు నచ్చలేదు, ఆమెకు నచ్చజెప్పడం ఎలా?
Also read: జాగ్రత్త, నెయిల్ పాలిష్ వల్ల ప్రాణాంతకమైన అలెర్జీ - కదలికలు కోల్పోయిన చేతి వేళ్ళు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.