ప్రశ్న: మా ఇంట్లో పద్దెనిమిదేళ్ల అమ్మాయి పని మనిషిగా చేస్తోంది. ఆమె తల్లిదండ్రులు చాలా పేదవారు కావడంతో ఈమెను చదివించలేక పనిలో పెట్టారు. అయితే ఆమె ఒక సైకిల్ మెకానిక్ ను ప్రేమించింది. ఆ విషయాన్ని నాకు చెప్పింది. నేను అతని మంచి వాడో కాదో తెలుసుకోమని, ముందుగా ఇంట్లో పెద్దల అనుమతి తీసుకోమని చెప్పాను. ఆమె ఓరోజు అతనితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుని వచ్చింది. తల్లిదండ్రులను వదిలిపెట్టేసింది. నాకు ఆమె చేసిన పని నచ్చలేదు. మా ఇంట్లో పని మాత్రం కొనసాగిస్తోంది. ఆమె పెద్దలకు చెప్పకుండా, ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు. ఆమె భవిష్యత్తులో మోసపోతుందేమోనని నాకు భయంగా ఉంది. ఆమెకు ఎలా నచ్చజెప్పాలో అర్థం కావడం లేదు. తల్లిదండ్రులను చేరదీయమని చెబుతున్నా వినడం లేదు. ఆ వ్యక్తి ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు. అతని కుటుంబం గురించి ఈమెకు ఏమీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఎలా జాగ్రత్తగా ఉండమని చెప్పాలో నాకు అర్థం కావడం లేదు.


- సునీత, హైదరాబాద్


జవాబు: రోడ్డుపై యాక్సిడెంట్ జరిగి మనిషి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే ఫోన్లో వీడియోలు తీసే కాలం ఇది. ఇలాంటి కాలంలో కూడా మీ పనిమనిషి జీవితం ఏమైపోతుందోనని మీరు ఆలోచిస్తున్న తీరు అభినందనీయం. ఆమె వయసు 18 ఏళ్లు. అంటే మేజర్ అయింది. కాబట్టి తల్లిదండ్రులే కాదు ఎవరూ ఏమీ చేయలేరు. ఆమెకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. కానీ ఆ వ్యక్తి సరైన వ్యక్తో కాదో ఆమె చూసుకోలేదు. తక్కువ కాలంలోనే ప్రేమ, తరువాత పెళ్లి బంధంలో ఆమె చిక్కుకుంది. ముఖ్యంగా అతని కుటుంబం గురించి ఆమెకు ఏమీ తెలియదు. మీరు ఆమె జీవితం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే మీ పనిమనిషి తల్లిదండ్రులను పిలిచి వారిని పోలీసు కంప్లయింట్ ఇవ్వమని చెప్పమనండి. పోలీసులతో మీరు మాట్లాడి అబ్బాయి తరుపు కుటుంబాన్ని కూడా పిలిపించి ఆ పెళ్లిని చట్టబద్ధం చేయండి. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లిని రిజిస్టర్ చేయించండి. అప్పుడు అతను ఎక్కడికి పారిపోయిన పట్టుకునే అవకాశం ఉంటుంది. 


అలాగే ఆ అమ్మాయిని ఓసారి కౌన్సిలింగ్ సెంటర్ కు తీసుకెళ్లండి. ఆమె జీవితంలో తొందరాపాటు నిర్ణయాలు తీసుకోకుండా వారు కౌన్సెలింగ్ ఇస్తారు. అలాగే ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి ఆమెకు అండగా ఉండమని చెప్పండి. పెళ్లి చేసుకున్న అబ్బాయిని పిలిపించి మాట్లాడండి. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోకపోతే చట్టపరమైన చర్యలకు వెళతామని చెప్పండి. మీ పనిమనిషి వయసు కేవలం 18 ఏళ్లేనని చెప్పారు. కాబట్టి తొందరపడి పిల్లల్ని కనవద్దని చెప్పండి. అయిదేళ్ల వరకు పిల్లల ప్లానింగ్ వద్దని ఆమెకు వివరించండి. ఈలోపు ఆమె చేసుకున్న వ్యక్తి ఎలాంటి వాడో కూడా బయటపడుతుంది. ప్రేమపెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ సరైన వాడిని ఎంపిక చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. వారి అనుమతి కోసం ఎదురుచూడాల్సిందని ఆమెకు చెప్పండి. అతడి వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తే, ఆమెను ఎవరు చేరదీస్తారో ఆలోచించమనండి. ఏది ఏమైనా ఆమెను జాగ్రత్తగా ఉండమని మాత్రం హెచ్చరించండి. ఆర్ధికంగా ఆమె కొంత మొత్తాన్ని దాచుకోమని సూచించండి. పరిస్థితులు ఎంతటి సవాళ్లను విసిరినా వాటిని ఎదుర్కోడానికి మానసికంగా సిద్ధంగా ఉండమని చెప్పండి. 



Also read: అతి చల్లని నీరు తాగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందా?



Also read: జాగ్రత్త, నెయిల్ పాలిష్ వల్ల ప్రాణాంతకమైన అలెర్జీ - కదలికలు కోల్పోయిన చేతి వేళ్ళు













గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.