Side Effects Of Soap | రోనా వైరస్ వల్ల చాలామందిలో శుభ్రతపై శ్రద్ధ పెరిగింది. అయితే, అది కేవలం చేతులను శుభ్రం చేసుకోవడానికే పరిమితమైంది. శరీరంలో చేతులు మాత్రమే శుభ్రంగా ఉంచుకుంటే సరిపోదు. మరికొన్ని ముఖ్యమైన భాగాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, అతిగా స్నానం చేయడం కూడా మంచిది కాదంటున్నారు.


అపరిశుభ్రంగా ఉండటమే కాదు, అతి శుభ్రత కూడా అంత సురక్షితం కాదు. మనలో చాలామందికి పదే పదే స్నానం చేసే అలవాటు ఉంటుంది. కొందరికి మాత్రం స్నానం చేయాలంటేనే బద్దకం. ఇక వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లయితే.. స్నానాలు చేసి ఎన్నాళ్లవుతుందో చెప్పడం కష్టమే. ఎందుకంటే.. వారికి ఉండే పని కూడా వారిని సీట్ నుంచి లేవనివ్వదు. దీంతో పూర్తిగా స్నానమైనా మానేస్తారు, లేదా రెండు చెంబుల నీళ్లు పోసుకుని హడావిడాగా వచ్చేస్తారు. అయితే, మీరు స్నానం ఎలా చేసినా, చేయకపోయినా.. మూడు ముఖ్యమైన భాగాలను మాత్రం ఎప్పుడు శుభ్రం చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అవే చంకలు, గజ్జలు, పాదాలు. మిగిలిన పార్టులను మీరు నీళ్లతో శుభ్రం చేసినా ఏమీ కాదు. 


టొరంటో విశ్వవిద్యాలయంలో డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శాండీ స్కాట్నిక్కి ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘సబ్బు‌తో మీ శరీరాన్ని తల నుంచి కాలి వరకు తోముతూ స్నానం చేయడం వల్ల తామర, ఇతర చర్మ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. దానికి బదులు మీరు మూడు శరీర భాగాలపైనే ఎక్కువ ఫోకస్ పెడితే మంచిది. ఎప్పుడూ మూసి ఉండే గజ్జలు, పాదాలతోపాటు నేలను తాకే పాదాలను బాగా శుభ్రం చేయాలి’’ అని తెలిపారు. 


‘‘మీరు శరీరాన్ని సబ్బుతో అతిగా రుద్దినట్లయితే సూక్ష్మక్రిములను గుర్తించే మైక్రోబయోమ్‌కు సహాయపడే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుంది’’ అని మేరీల్యాండ్‌లోని చెవీ చేజ్‌లోని డైజెస్టివ్ సెంటర్ ఫర్ ఉమెన్ వ్యవస్థాపకుడు రోబిన్నే చుట్కాన్ తెలిపారు. ‘‘మీ శరీరానికి నిర్దిష్ట బ్యాక్టీరియా అవసరం. మీరు సబ్బుతో అతిగా తోమడం వల్ల ఆ బ్యాక్టీరియా చనిపోతే.. కొన్ని వైరస్‌లను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా మీరు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, మీరు ఎప్పుడు స్నానం చేసినా చంకలు, గజ్జలను మాత్రమే బాగా శుభ్రం చేయాలి. ఒక వేళ వ్యాయమం, తీవ్ర ఉక్కపోత వల్ల బాగా చెమట పట్టినా, దుమ్మూదూళిలో తిరిగి వచ్చినా మిగతా శరీరా భాగాలను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. కానీ అతిగా రుద్దకూడదు’’ అని తెలిపారు. సబ్బుతో శరీరాన్ని అతిగా రుద్దడం వల్ల మంచి బ్యాక్టీరియాను కోల్పోతారని, దానివల్ల రోగ నిరోధక శక్తి తగ్గి చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని 2018లో సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించబడిన ఓ అధ్యయనంలో పేర్కొన్నారు. 


Also Read: టమోటాలతో రష్యా డ్రోన్‌ను కూల్చేసిన ఉక్రేయిన్ మహిళ, ఇదే కదా స్త్రీ శక్తి అంటే!


ఆ మూడు భాగాలే ఎందుకు బాగా శుభ్రం చేయాలి?: శరీరాన్ని సబ్బుతో అతిగా రుద్దవద్దని చెబుతున్నారు సరే, మరి ఆ మూడు భాగాలను మాత్రం బాగా శుభ్రం చేయాలని ఎందుకు చెబుతున్నారు? అనేగా మీ సందేహం? అయితే చూడండి. గజ్జలు, చంకలు, పాదాలు శరీరంపై అత్యంత సున్నితమైన ప్రాంతాలు. ప్రమాదకర ఫంగస్, బ్యాక్టీరియాలకు అవే నిలయాలు. అక్కడ పెరిగే ఫంగస్ వల్లే ఇన్ఫెక్షన్లు కలిగించే ఇన్‌గ్రోన్ హెయిర్ వంటివి ఏర్పడతాయి. అక్కడ పెరిగే చెడు బ్యాక్టీరియా చాలా ప్రమాదకరం. వివిధ వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి.. ఈ మూడు భాగాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. 


Also Read: జపాన్‌లో ముక్కలైన వెయ్యేళ్ల ‘కిల్లింగ్ స్టోన్’, 9 తోకల నక్క విడుదల! రష్యా-ఉక్రేయిన్ పోరుతో లింకేంటీ?


గమనిక: వివిధ అధ్యయనాలు, స్డడీ, వైద్య సూచనల ఆధారంగా ఈ కథనాన్ని మీకు అందించాం. ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.