Killing Stone In Japan | జపాన్‌లో ఉన్న ఆ రాయికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. అంతేకాదు, దానికి భయానకమైన శాపం కూడా ఉంది. ఆ రాయిని ఎవరైతే ముట్టుకుంటారో.. వారు వెంటనే చనిపోతారు. అందుకే, దాన్ని ‘కిల్లింగ్ స్టోన్’ అని పిలుస్తారు. అయితే, అది సాదాసీదా రాయి కాదు. మన ‘అరుంధతి’ సినిమాలో పశుపతిని బంధించినట్లుగా.. ఆ రాయిలో ఓ భయంకర ప్రేత్మాత్మను బంధించారు. ఇప్పుడు ఆ ప్రేతాత్మ సంకెళ్లను తెంచుకుంది. ఆ కిల్లింగ్ స్టోన్ రెండు ముక్కలు కావడంతో.. వెయ్యేళ్లగా ఆ రాయిలోనే మగ్గిన ఆత్మకు స్వేచ్ఛ లభించింది. దీంతో జపాన్ ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ రాయిలో ఉన్న ఆత్మ ఎవరిది? ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? రష్యా-ఉక్రేయిన్ యుద్ధానికి, ఆస్ట్రేలియా వరదలకు ఈ రాయికి లింకేంటీ?


ఆ అందమైన అమ్మాయే.. ఈ రాతిలో ఆత్మలా..: టోక్యోకు సమీపంలో గల తోచిగి ప్రిఫెక్చర్ ప్రాంతంలో ఈ ‘కిల్లింగ్ స్టోన్’ ఉంది. జపాన్ పురాణాల ప్రకారం.. ఈ పొడవైన రాయిలో 1107-1123 వరకు జపాన్‌ను పాలించిన టోబా చక్రవర్తిని గద్దె దించి, హత్య చేయడానికి తమమో-నో-మే అనే అందమైన మహిళ ప్రయత్నించింది. ఈ సందర్భంగా టోబా చక్రవర్తి ఆమెను చంపేశాడు. అయితే, ఆమె అస్సలు మనిషే కాదని, తొమ్మిది తోకలు ఉండే నక్క(Nine-tailed fox) అని తేలింది. మరణం తర్వాత ఆమె ఓ అగ్నిపర్వత శిలలో బంధీ అయ్యింది. అదే ఈ ‘కిల్లింగ్ స్టోన్’. 


Also Read: బాక్స్ నిండా మనుషుల తలలు, నగలనుకుని ఎత్తుకెళ్లిన దొంగలు - ఇంతకీ అవి ఎవరి తలలు?


మనిషి కాదు తొమ్మిది తోకల నక్క: ఈ రాయి గురించి ఇప్పటివరకు ఎన్నో కథలు ప్రాచూర్యంలో ఉన్నాయి. ముఖ్యంగా ఓ జపాన్ కార్టూన్ కథ అక్కడ బాగా పాపులర్ అయ్యింది. ఫలితంగా జపాన్ ప్రజల్లో కూడా ‘కిల్లింగ్ స్టోన్’పై భయం పెరిగింది. అయితే, దాన్ని ముట్టుకుంటే చనిపోతారనే సమాచారంపై మాత్రం క్లారిటీ లేదు. కానీ, ‘కిల్లింగ్ స్టోన్’ రెండు ముక్కలుగా విరగడం వల్ల ఎలాంటి అనార్థాలు జరుగుతాయో అనే ఆందోళనతో ఉన్నారు. పైగా ఆ రాయిలో పూర్వికులు తెలిపినట్లే గుల్లగా ఉంది. అంటే.. నిజంగా ఆమె ఆత్మ అందులో ఉండేదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ రాయి పగలడం వల్ల ఆ తొమ్మిది తోకల నక్క దెయ్యం బయటే తిరుగుతుందని, ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం, ఆస్ట్రేలియాలో ఎన్నడూలేనంతా వరదలు ఏర్పడటానికి కారణం అదేనని అంటున్నారు. 






రాయిని మళ్లీ అతికిస్తారా?: అయితే, కొందరు మాత్రం ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కరోనా, యుద్ధం, వరదలు చూసి.. ఆ ప్రేతాత్మ తిరిగి రాయిలోకి వెళ్లిపోతుందిలే అని జోకులు పేలుస్తున్నారు. ‘కిల్లింగ్ స్టోన్’కు సమీపంలో వేడి నీటి ఊటలు(బుగ్గలు) కూడా ఉన్నాయి. దీంతో ఈ రాయిని చూసేందుకు వచ్చే పర్యాకుల్లో చాలామంది వాటిని సందర్శిస్తారు. అయితే, ఈ రాయి పగిలిపోవడం వల్ల పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాయిని మళ్లీ అతికించాలని అధికారులు భావిస్తున్నారు.