Womens Day in Vijayawada: రెండున్నర ఏళ్లుగా అధికారాన్ని ఏపీ ప్రభుత్వం మహిళల కోసమే వినియోగించిందని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సీఎం తెలిపారు. మన చుట్టూ ఉన్నది మహిళా ప్రజా ప్రతినిధులేనని.. ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం మెండుగా కనిపిస్తోందని తెలిపారు. సాధికారతకు మహిళలు ప్రతినిధులుగా నిలుస్తున్నారని కొనియాడారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళల గొప్పతనం గురించి మాట్లాడారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారత కోసం ఎలాంటి పథకాలు చేపట్టిందో ఈ వేదికపై నుంచి సీఎం మరోసారి వివరించారు.


34 నెలల కాలంలో మహిళల చేతికి సంక్షేమ పథకాల రూపేణా రూ.1.18 లక్షల కోట్లు అందించినట్లు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా సాయం అందిస్తున్నామని తెలిపారు. డిప్యూటీ సీఎం, హోం మంత్రి పదవులు కూడా మహిళలకే ఇచ్చామని గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 51 శాతం మంది మహిళలే పని చేస్తున్నారని సీఎం జగన్ వెల్లడించారు. ప్రతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసు నియామకం విప్లవాత్మకమైన మార్పు అని సీఎం జగన్ అన్నారు. 



విద్యా దీవెన, వసతి దీవెన కల్పించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడైనా ఉందా అని సీఎం జగన్ సభకు హాజరైన వారిని అడిగారు. విద్యా దీవెన ద్వారా రూ.6,260 కోట్లు నేరుగా అందించామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇలాంటి పథకాలను ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏనాడూ అమలు చేయలేదని గుర్తు చేశారు. మహిళలకు ఆహారలోటు రాకుండా సంపూర్ణ పోషణ పథకం అందిస్తున్నామని, తద్వారా 34.16 లక్షల మంది మహిళలకు మేలు కలుగుతోందని తెలిపారు. ఈ పథకం కోసం ఏకంగా రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం, దిశ యాప్‌, దిశ పీఎస్‌లు తీసుకొచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్‌ రూపొందించామని పేర్కొన్నారు.


మహిళలకు 51 శాతం పదవులు కేటాయించాలని ఏపీ ప్రభుత్వమే చట్టం చేసిందని సీఎం జగన్ తెలిపారు. మహిళల కోసం ఇలా చట్టం చేసిన రాష్ట్రం ఏపీనే అని గుర్తు చేశారు. దేశ చరిత్రలోనే ఇంత మంది మహిళా ప్రజాప్రతినిధులతో సభ జరిగి ఉండదని తెలిపారు. జడ్పీ ఛైర్‌ పర్సన్‌లుగా 54 శాతం మంది మహిళలే ఉ‍న్నట్లు గుర్తు చేశారు. 13 జడ్పీ చైర్మన్‌లతో ఏడుగురు మహిళలేనని తెలిపారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లుగా 64 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు. నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టులు మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. రెండున్నర ఏళ్లుగా అధికారాన్ని మహిళల కోసం వినియోగించామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే రోజా, వాసిరెడ్డి పద్మ సహా పలువురు మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.