బంగారు ‘సీమ’.. కర్నూలు జిల్లాలో గోల్డ్‌ మైన్‌.. కర్నూలు జిల్లా జోన్నగిరి సమీపంలో గోల్డ్‌ మైన్ బంగారం నిక్షేపాల వెలికితీతకు ముందుకొచ్చిన జియో మైసూర్‌ సంస్థ. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి సమీపంలో బంగారం వెలికితీత పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పైలట్‌ ప్రాజెక్ట్‌ మంచి ఫలితాలు ఇవ్వడంతో గోల్డ్‌ మైన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు జియో మైసూర్‌ సంస్థ ముందుకొచ్చింది. ప్లాంట్‌ను నెలకొల్పి ఏడాదిలోపు బంగారం నిక్షేపాల వెలికితీత పనులు చేపట్టనుంది. జిల్లాలోని తుగ్గలి, మద్దికెర మండలాల్లో బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని 1994లోనే జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సర్వే ద్వారా నిర్ధారించింది.


భారత ప్రభుత్వం మైనింగ్‌ సెక్టార్‌లో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించిన తర్వాత 2005లో జియో మైసూర్‌ అనే సంస్థ జొన్నగిరి సమీపంలో గోల్డ్‌ మైన్‌ నిర్వహణకు దరఖాస్తు చేసింది. దరఖాస్తును అప్పటి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పరిశీలించింది. అనుమతులు ఇచ్చేలోపే ప్రమాదవశాత్తు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మృతి చెందారు. ఆపై రాష్ట్ర విభజన సమస్య, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను నేపథ్యంలో మైనింగ్‌ అనుమతులకు ఆటంకం ఏర్పడింది. ఎట్టకేలకు 2013లో అనుమతులు లభించగా.. 2014లో జియో మైసూర్‌ సంస్థ బంగారం నిక్షేపాలపై అన్వేషణ మొదలు పెట్టింది.


350 ఎకర కొనుగోలు తుగ్గలి, మద్దికెర మండలాల్లో 350 ఎకరాలను జియో మైసూర్‌ సంస్థ కొనుగోలు చేసింది. మరో 1,500 ఎకరాలను లీజుకు తీసుకుంది. రైతులకు ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున కౌలు చెల్లిస్తోంది. కొనుగోలు చేసిన 350 ఎకరాల్లో మైనింగ్, ప్రాసెసింగ్‌ యూనిట్, డంప్‌ యార్డ్, వాటర్‌ రిజర్వాయర్‌ నిర్మించారు. దీనికి రూ.95 కోట్ల వరకూ సంస్థ ఖర్చు చేసింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 1,500 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒక డ్రిల్లింగ్‌ చొప్పున మొత్తం 30 వేల మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేయించింది. బంగారం లభ్యత, నాణ్యత, మైనింగ్‌ చేస్తే వచ్చే లాభనష్టాలు తదితర అంశాలను అంచనా వేసేందుకు పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టింది.


 ఇది ఫలించడంతో పూర్తిస్థాయిలో ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన యంత్ర సామగ్రి కొనుగోలు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి ప్లాంట్‌ నిర్మాణ పనులు ప్రారంభించి 12 నెలల్లో పూర్తి చేయనుంది. ఇందుకోసం రూ.300 కోట్లు వెచ్చిస్తోంది. ప్లాంట్‌ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రతినిధులు ప్రతి వారం సమీక్షిస్తున్నారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో తొలి గోల్డ్‌ మైన్‌ మన దేశంలో 1880లో కోలార్‌ గోల్డ్‌ మైన్‌ ప్రారంభమైంది. స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటివరకు దేశంలో ఎక్కడా గోల్డ్‌ మైనింగ్‌ చేపట్టలేదు. ఇప్పుడు జియో మైసూర్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్నదే తొలి గోల్డ్‌ మైనింగ్‌ ప్లాంట్‌ కానుంది. దీని నిర్మాణంతో ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా మరో 1000 మంది వరకు ఉపాధి లభిస్తుంది.