Premature Deaths from Sitting for Long Hours : ప్రస్తుతకాలంలో చాలామంది డెస్క్ జాబ్సే ఎక్కువగా చేస్తున్నారు. చాలామంది ఇంపార్టెంట్ పని అయితే తప్పా డెస్క్​ నుంచి లేవరు. అలాంటివారిలో మీరు కూడా ఉన్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే మీరు స్మోకింగ్ చేసినంత ప్రమాదమట. ఇలా నిరంతరంగా కూర్చోని పని చేస్తే.. ప్రాణాంతక, దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఇదే ప్రాణాంతక సమస్యలకు కారణమవుతుందని గుర్తించారు. మరి ఈ స్టడీలో ఏమి తేలిందో.. నిజంగానే ఎక్కువసేపు కూర్చోని పనిచేయడం వల్ల ప్రాణాంతక సమస్యలు వస్తాయో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. 


అకాల మరణాలు తప్పవట.. 


ఎలాంటి శారీరక శ్రమ లేకుండా కూర్చోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, ఊబకాయ, పొట్ట పెరగడం, స్థూలకాయం, చెడు కొలెస్ట్రాల్, గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్ సమస్యల ప్రమాదం పెరుగుతుందని తాజా అధ్యయనం తెలిపింది. డీప్ వెయిన్ థ్రాంబోసిన్ కూడా అభివృద్ధి చెందే ప్రమాదం ఉందని తేల్చారు. ఈ పరిస్థితి కాళ్లలో లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. అంతేకాకుండా అకాల మరణాలకు కారణమవుతుందని తెలిపారు. స్మోకింగ్ చేసేవారి మాదిరిగానే ఇది ప్రాణాంతక సమస్యలను ప్రేరేపిస్తుందని తెలిపారు. అందుకే కూర్చొన్న ప్రతి 30 నుంచి 45 నిమిషాలకు ఓసారి వాకింగ్ బ్రేక్ తీసుకోవాలంటున్నారు. విరామం లేకుండా ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. 


ప్రాణాంతక వ్యాధులతో జాగ్రత్త


శారీరక శ్రమలేకుండా రోజూ 8 గంటలు కంటే ఎక్కువ సేపు కూర్చుంటే.. వారు చనిపోయే ప్రమాదముందని.. ఇది స్థూలకాయం సమస్యలన్ని పెంచుతుందని న్యూరాలజిస్ట్​లు తెలుపుతున్నారు. స్మోకింగ్ ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ.. ఇలా కూర్చోవడం వల్ల వస్తాయని చెప్తున్నారు. టైప్ 2 డయాబెటిస్, వివిధ జీవక్రియ రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతాయి. ఎక్స్​టెండెడ్ సిట్టింగ్ గ్లూకోజ్ మెటబాలిజం, లిపిడ్ ప్రొఫైలను దెబ్బతీస్తుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను పెంచడంతో పాటు.. అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని కలిగి ఉంటుందని చెప్తున్నారు. ఇవే కాకుండా డీప్ సిర త్రాంబోసిస్ అభివృద్ధి చెందుతుందని.. ఇది కాళ్లలో ఏర్పడుతుందని తెలిపారు. రక్తం గడ్డకట్టి.. ఊపిరితిత్తులకు ప్రయాణిస్తే ప్రాణాంతకమవుతుంది.


సమస్యను అధిగమించాలంటే.. 


ప్రతి అరగంటకు లేదా 45 నిమిషాలకు ఓసారి లేచి నడవాలని చెప్తున్నారు. లేదంటే కనీసం గంటలో ఓ 5 నిమిషాలు లేచి అటూ ఇటూ నడిస్తే మంచిదంటున్నారు. వీటిని అధిగమించేందుకు రోటీన్ లైఫ్​లో శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి అంటున్నారు. ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేస్తూ ఉంటే కాళ్లకు మెరుగైన రక్తప్రసరణ అందుతుంది. లేదంటే స్టాండింగ్ డెస్క్​లు ఉపయోగించవచ్చని చెప్తున్నారు. లేదంటే ఎలివేటర్​కు బదులుగా మెట్లు ఎక్కవచ్చని చెప్తున్నారు. 


ఇవి ఫాలో అయితే మంచిది..


రోజులో కనీసం గంట నుంచి గంటన్నర మితమైన శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలంటున్నారు. ఫాస్ట్ వాక్, పరుగు లేదా సైక్లింగ్  చేయడం వల్ల ఈ తరహా సమస్యలు దూరమవుతాయి. రెస్ట్ తీసుకునే సమయంలో టీవీ, మొబైల్ ఫోన్​లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్​లు చూడటం తగ్గిస్తే మంచిది. మీటింగ్స్ వంటివాటిని నిల్చోని చేసేలా ట్రై చేయండి. కాఫీ బ్రేక్స్ తీసుకోండి. వీటిని ఫాలో అయితే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చంటున్నారు. 


Also Read : ఎండ తీవ్రత ఎక్కువ అవుతోంది జాగ్రత్త.. ముఖ్యంగా వారు ఏమాత్రం లైట్ తీసుకున్నా అంతే సంగతులు





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.