వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది గంటల తరబడి కూర్చుని ఉంటున్నారు. ఆఫీసులో ఉంటే కాసేపు అయినా టీ లేదా కాఫీ అని బయటకి వెళ్ళడం వాకింగ్ చేయడం చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులు కారణంగా ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుని ఉంటున్నారు. మళ్ళీ పొద్దున్నే వ్యాయామం కూడా చేస్తున్నారు. అయితే రోజంతా కూర్చుని ఉంటూ కేవలం 30 నిమిషాలు వ్యాయామం చేసినా దాని ఫలితం శరీరం మీద ఏ మాత్రం కనిపించదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


యాక్టివ్ కాచ్ పొటాటో పేరిట ఓ బృందం అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో దాదాపు 3,700 మంది పురుషులు, స్త్రీలని వాళ్ళు ఒక వారం పాటు పరిశీలించారు. రోజంతా వారి కదలికలని అంచనా వేశారు. దీని ప్రకారం రోజూ 30 నిమిషాలపాటు వ్యాయామం చేసినప్పటికి 10 నుంచి 12 గంటల వరకు కూర్చుని ఉండే వారిలో రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, శరీర కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు వాళ్ళు గమనించారు. మధ్య మధ్యలో కాసేపు లేచి నడుస్తూ ఉన్నవాళ్ళతో పోలిస్తే ఎక్కువ సేపు కూర్చుని ఉండే వారి ఆరోగ్య పరిస్థితిలో మార్పులు చోటు చేసుకున్నాయి.


30 నిమిషాలు వ్యాయామం సరిపోదు


అధ్యయనానికి అధ్యక్షతవహించిన ఔలు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త మాట్లాడుతూ రోజుకి కేవలం 30 నిమిషాలపాటు వ్యాయామం చేస్తే సరిపోదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కువ సేపు కూర్చుకోవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలను తొలగించడానికి అతి కొద్ది సేపు వర్క్ అవుట్స్ చేయడం సరిపోదని అన్నారు. ఎక్కువ సేపు కూర్చుని ఉన్న వాళ్ళతో పోలిస్తే లేచి కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉన్న వాళ్ళు 40 శాతం ఎక్కువ చురుకుగా ఉన్నారు.


అధ్యయనంలో పాల్గొన్న కొంతమంది రోజులో ఒక గంట వ్యాయామం చెయ్యడమే కాకుండా రోజువారీ పనుల్లో భాగంగా రెండు గంటలు అదనపు శారీరక శ్రమ చేస్తున్నారు. అధిక గంటలు కదలకుండా కూర్చొని ఉండటం వల్ల వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయి. శరీరంలోని కొవ్వు శాతం పెరుగుదలని గమనించారు. అంటే కాదు కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.


ఎలా అధిగమించాలి


వ్యాయామంతోపాటు షికారుకి వెళ్ళడం, వేగంగా నడవడం, వంగుతూ ఇంటికి శుభ్రపరచడం, మెట్లు ఎక్కడం, ఆఫీసు కారిడార్లో కాసేపు వాకింగ్ చేయడం వంటివి చేయవచ్చు. అధ్యయనం ప్రకారం రోజుకి 80-90 నిమిషాలు తేలికపాటి కార్యకలాపాలు చేయడం వంటివి చేస్తూ ఉండాలి. వ్యాయామంతోపాటు శారీరక శ్రమ కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అంటే తక్కువ కూర్చుని ఎక్కువగా కదలాలి.


తినడం కోసం కూర్చున్న స్థలం నుంచి వేరే చోటుకి వెళ్ళడం, తిన్న వెంటనే కొద్దిసేపు నడవటం వంటివి చేస్తూ ఉండాలి. గంటల తరబడి అలాగే కూర్చుని సిస్టమ్ ముందు ఉండటం వల్ల మెడ నొప్పులు కూడా వస్తాయి. అందువల్ల ఒకే వైపు తీక్షణంగా చూస్తూ ఉండకుండా మెడ భాగాన్ని అటు ఇటు తిప్పుతూ కదిలించాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అసలు వదిలిపెట్టరు


Also Read: గర్భిణులకు ఆకలి వేయకపోవడానికి కారణాలు ఇవే