హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ తెలంగాణ విమోచన దిన వేడుకల్లో పాల్గొన్న అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. బేగంపేట్ లోని టూరిజం హరిత హోటల్ లో అమిత్ షాతో బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం అయింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి, ఈటల రాజేందర్, రాజ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


పరేడ్ గ్రౌండ్ నుంచి బేగంపేటలోని హరిత టూరిజం హోటల్ వరకూ బండి సంజయ్ అమిత్ షా వెంటనే వచ్చారు. ఇరువురు కీలక విషయాలు మాట్లాడుకున్నట్లు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికలు, పార్టీ బలోపేతం, పార్టీలోకి చేరికల అంశం చర్చించుకున్నట్లుగా సమాచారం. పార్టీ కోర్ మీటింగ్ లోనూ ఈ అంశాలే చర్చకు వచ్చే అవకాశం ఉంది.


పుల్లెల గోపీచంద్ భేటీ
ఈ సందర్భంగానే అమిత్ షాను జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కలిశారు. దీనిపై గోపీచంద్ ను విలేకరులు ప్రశ్నించగా, తాము ఇద్దరం రాజకీయాల గురించి చర్చించలేదని అన్నారు. కేవలం క్రీడలు, పతకాల గురించే మాట్లాడుకున్నామని చెప్పారు. క్రీడల్లో పురోగతి, అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలు, విధానాలు తమ మధ్య చర్చకు వచ్చాయని చెప్పారు. పుల్లెల గోపీచంద్ మర్యాదపూర్వకంగా కలిశారని బీజేపీ నేతలు చెబుతున్నారు.


కారు అద్దాలు ధ్వంసం


అయితే, బేగంపేటలోని హోటల్ కు వస్తుండగా అమిత్ షా భద్రతా సిబ్బంది గోసుల శ్రీనివాస్ అనే టీఆర్ఎస్ నేత కారు అద్దాలను ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. బేగంపూట టూరిజం హోటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హోటల్‌కు వస్తున్న సందర్భంలో ఎంట్రన్స్ గేటు వద్ద ఓ కారు ఆగిపోయి ఉంది. అమిత్ షా కాన్వాయ్ ఆగిపోయిన ఆ కారు కదల్లేదు. దీంతో అమిత్ షాకు భద్రత కల్పించే ఎస్పీజీ  సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వెళ్లి కారును తొలగించాల్సిందిగా కారులో ఉన్న గోసుల శ్రీనివాస్ ను తొందరపెట్టారు.


టెన్షన్‌తో కారు తీయలేకపోయా - గోసుల శ్రీనివాస్
అయితే అతను తొలగించడానికి ఆలస్యం చేశారు. దీంతో ఎస్పీజీ సిబ్బంది కారు అద్దాలను ధ్వంసం చేశారు. బలవంతంగా గేటుకు అడ్డంగా ఉన్న కారును పక్కకు తప్పించారు. దీంతో అమిత్ షా కాన్వాయ్ లోపలోకి వెళ్లగలిగింది. కారులో టీఆర్ఎస్ కండువాలు కూడా ఉన్నాయి. బీజేపీ ముఖ్య నేతల సమావేశం పెట్టుకున్న హోటల్‌లోకి టీఆర్ఎస్ నేత తన కారుతో వచ్చి ఎంట్రీకి కారు అడ్డం పెట్టినా చాలా సేపటి వరకూ పట్టించుకోకపోవడం భద్రతా  వైఫల్యం అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా కాన్వాయ్ బయలుదేరిన వెంటనే.. రోడ్ క్లియర్ చేస్తారని అలాంటిది గేటు దగ్గర కారు ఉన్నా తీయకపోవడం ఏమిటని బీజేపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఎస్పీజీ వర్గాలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహించినట్లు తెలుస్తోంది.


చర్యలు తీసుకునే అవకాశం
గోసుల శ్రీనివాస్ టీఆర్ఎస్ నేతగా గుర్తింపు పొందారు. అయితే తన కారు అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డుగా పెట్టలేదని.. హోటల్లోకి వెళ్తున్న సమయలో ఆగిపోయిందన్నారు. ఈ లోపు అమిత్ షా భద్రతా సిబ్బంది వచ్చి ప్రశ్నించడంతో టెన్షన్‌కు గురయ్యానని పక్కకు తీయడంలో ఆలస్యమయిందని అన్నారు. ఈ లోపు భద్రతా సిబ్బంది కారు అద్దాలు పగులగొట్టారన్నారు. ఇది అనవసరంగా సృష్టించిన వివాదమని.. తన వైపు తప్పు లేదని ఆయన చెబుతున్నారు. ఇది భద్రతా లోపం కావడంతో గోసుల శ్రీనివాస్‌పై భద్రత పరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.