జన్మాష్టమి, కృష్ణాష్టమి, గోకులాష్టమి... ఈ పండుగకు ఎన్ని పేర్లో. దీన్ని అష్టమి రోహిణి కూడా అంటారు. కృష్ణాష్టమి నాడు భక్తులు ఎంతో మంది ఉపవాసం ఉంటారు. సాయంత్రం ఆ స్వామిని పూజించుకుని బెల్లం, చక్కెర పాలు కలిపి చేసిన తీయటి నైవేద్యాలను నివేదిస్తారు. ఊయల కట్టి చిట్టి కన్నయ్యను ఊపుతారు. వీధుల్లో ఉట్టి పెట్టి వాటిని కొడుతూ ఎంజాయ్ చేస్తారు.  పిల్లలకు ఎంతో ఇష్టమైన పండుగ జన్మాష్టమి. అబ్బాయిలను కృష్ణుడిలా, అమ్మాయిలను గోపికల్లా తయారుచేస్తారు. స్కూల్లో సెలెబ్రేషన్స్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతాయి.  పండుగ రోజున చిట్టి కన్నయ్యకు నివేదించేందుకు సింపుల్ స్వీట్ రెసిపీలు ఇవిగో. 


కావాల్సిన పదార్థాలు
బొంబాయి రవ్వ - రెండు కప్పులు
పాలు - అర కప్పు
నెయ్యి - మూడు స్పూన్లు
ఎండు కొబ్బరి పొడి - ఒక కప్పు
చక్కెర - ఒకటిన్నర కప్పు
యాలకుల పొడి - అర స్పూను
కిస్‌మిస్‌లు - పావు కప్పు
జీడిపప్పులు - పది


తయారీ ఇలా
1. కళాయిలో నెయ్యి వేసి బొంబాయి రవ్వను వేయించాలి. 
2. అందులోనే ఎండు కొబ్బరి పొడి వేసి వేయించాలి. 
3. అవి వేగాక చక్కెర వేసి వేయించాలి. 
4. చక్కెర బాగా కరిగి మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. 
5. యాలకుల పొడి కూడా వేసి కలపాలి. 
6. మొత్తం మిశ్రమం చల్లార బెట్టాలి.
7. నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లను రవ్వ మిశ్రమంలో కలపాలి. 
8. రవ్వ మిశ్రమం చల్లారాక కొంచెం పాలు పోసుకోవాలి. 
9. ఆ మిశ్రమాన్ని ఉండలుగా లడ్డూల్లా చుట్టుకోవాలి. 
10. అంటే తియ్యటి కొబ్బరి రవ్వ లడ్డూలు నివేదనకు రెడీ అయినట్టే. 


..............................
అటుకుల పాయసం


కావాల్సిన పదార్థాలు
అటుకులు - ఒక కప్పు
పాలు - రెండు కప్పులు
బెల్లం తురుము - ఒక కప్పు
నీళ్లు - రెండు కప్పులు
ఎండుకొబ్బరి తురుము -మూడు కప్పులు
యాలకుల పొడి - అర టీస్పూను
జీడిపప్పులు - అయిదు
నెయ్యి - రెండు స్పూనులు
బాదం పప్పులు - అయిదు


తయారీ ఇలా
1. కళాయిలో అటుకులు వేసి వేయించి పక్కకి తీసుకుపెట్టుకోవాలి. 
2. అదే కళాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదంపప్పులు, ఎండుకొబ్బరి తురుము లేదా ముక్కలు వేసి వేయించి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. 
3. అదే కళాయిలో బెల్లం, నీళ్లు వేసి కరిగే వరకు ఉడికించాలి. 
4. బెల్లం కరిగిపోయాక నీటిని వడపోసుకుంటే మలినాలేమైనా ఉంటే తొలగించవచ్చు. 
5. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు పోసి మరిగించాలి. 
6. ఆ పాలు మరిగాక అటుకులను వేసి ఉడికించాలి. 
7. అటుకుల మెత్తగా అయ్యేవరకు ఉడికించాక బెల్లం నీటిని కలపాలి. 
8. అందులో యాలకుల పొడిని కలపాలి. 
9. ముందుగా కళాయిలో వేయించుకున్న జీడిపప్పు, బాదం, కొబ్బరి ముక్కలు అటుకుల మిశ్రమంలో వేయాలి. 
10. చిక్కగా పాయసంలా ఉడికించుకున్నాక స్టవ్ కట్టేయాలి. 
తియ్యటి అటుకుల పాయసం సిద్ధమైనట్టే. కావాలంటే వేడి నెయ్యి పైన వేసుకోవచ్చు.


Also read: నెలసరి నొప్పి రాకుండా ఉండాలంటే తాగాల్సిన డ్రింకులు ఇవే


Also read: ఎంత నవ్వితే గుండెకు అంత మంచిది, హైబీపీ - మధుమేహం కూడా అదుపులో, ఇకనైనా నవ్వండి