నవ్వు నాలుగు విధాల చేటు... వంటి పాత చింతకాయల పచ్చడి కబుర్లకు సెలవు చెప్పండి. నవ్వే వాళ్లని చూసి ‘ఎందుకలా నవ్వుతున్నారు? పనిలేదా’లాంటి డైలాగులు ఆపండి. వీలైతే వారితో కలిసి మీరు నవ్వేందుకు ప్రయత్నించండి. అలా నవ్వడం మీ ఆరోగ్యానికే మేలు జరుగుతుంది.చాలా రోగాలు రాకుండా ఉంటాయి. శారీరకంగా, మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైనా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతుంటే వారితో మాట కలపండి. ఆ నవ్వులో భాగంకండి. ప్రపంచంలో అతి చవకైన ఔషధం అదే. రోజులో కాసేపైనా స్నేహితులతో చిట్ చాట్ చేస్తూ ఛిల్ అయితే ఎన్నో అధ్భుత ప్రయోజనాలు కలుగుతాయి. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు


కార్టిసోల్ తగ్గిస్తుంది
కార్టిసోల్ అనేది ఒత్తిడి హార్మోన్. నవ్వడం వల్ల ఆ హార్మోన్ తగ్గుతుందని తేలింది. కార్టిసోల్ తగ్గినప్పుడు శరీరంపై, మనస్సుపై చాలా ప్రభావం పడుతుంది. సమస్యలు చిన్నవిగాక నిపిస్తాయి, పరిష్కారాలు కూడా వెంటనే మెదడుకు తడతాయి. హైబీపీ, మధుమేహం వంటి రోగాలు అదుపులో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో నవ్వు ఎంతో ఉపయోగపడుతుంది. రాత్రి నిద్ర చక్కగా పట్టేందుకు సహాయపడుతుంది. 


గుండెకు రక్ష
చక్కగా నవ్వడం వల్ల గుండెకు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. అలాగే హృదయ స్పందన రేటు ఆరోగ్యకరంగా, శ్వాసకోశ పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఆక్సిజన్ వినియోగాన్ని ప్రేరేపిస్తుంది. రోజులో సంతోషంగా కాసేపైనా నవ్వేవారిలో గుండె, ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. శరీరం మొత్తం రక్త సరఫరా అవుతుంది. దీనివల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గిపోతుంది.  


కేలరీలు కరుగుతాయి
కేలరీలను కరిగించడంలో కూడా నవ్వు సహాయపడుతుంది. పొట్ట దగ్గరి కొవ్వును కరిగిస్తుంది. అతిగా నవ్వినప్పుడు పొట్ట నొప్పి రావడం సహజం. అంటే నవ్వు పొట్టపై ప్రభావం చూపిస్తుందన్నమాట. అలాగే దవడలు కూడా నొప్పి వస్తాయి. అందుకే నవ్వడం వల్ల శరీరంలోని చాలా భాగాలు ప్రభావితం అవుతాయి. కేలరీలు కరుగుతాయి. 


మానసిక స్థితికి...
నవ్వు మానసిక స్థితిని మెరుగుపరచడంలో ముందుంటుంది. నవ్వడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగించే హార్మోన్లు. లాఫింగ్ యోగా గురించి తెలిసే ఉంటుంది. ఇందులో పకపకా నవ్వుతూనే ఉంటారు. దీని వల్ల మానసిక ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది.  కాబట్టి రోజూ కనీసం అయిదు నిమిషాలైనా నవ్వు యోగాను ప్రాక్టీసు చేయండి. 


జ్ఞాపకశక్తికి పదును 
మంచి నవ్వు మెదడు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. పరిశోధనల ప్రకారం రోజూ హాయిగా నవ్వే వ్యక్తులు పదునైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. ఇతరులతో పోలిస్తే వారు ఎన్నో విషయాలు గుర్తుంచుకుంటారు. 


Also read: స్త్రీలు ఏ వయసు వరకు బిడ్డను కనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు?


Also read: రాత్రి పూట ఈ మందులు వేసుకుంటే నిద్రకు దూరమవ్వడం ఖాయం






























































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.