South Inidian Breakfast : కొందరు పూరీల్లోకి పప్పు, చికెన్ లాంటివి చేసుకుంటారు. కానీ అచ్చమైన పూరీలకు స్వచ్ఛమైన కర్రీ చేసుకోవడంలోనే అసలైన టేస్ట్ దాగి ఉంది. హోటళ్లలో పూరీలు తిన్నప్పుడు వాటి రుచి పూర్తిగా డిఫరెంట్​గా ఉంటుంది. ఎందుకంటే వారు ఇచ్చే కర్రీ ఆ టేస్ట్​ని పెంచుతుంది కాబట్టి. కానీ కొందరికి ఈ పూరీ కర్రీ చేయడం రాక.. పప్పు వంటి కూరలతో అడ్జెస్ట్ అయిపోతారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే.. ఈ పూరీ కర్రీ రెసిపీ మీకోసమే. ఈ టేస్టీ పూరీ కర్రీని ఏవిధంగా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


నూనె - 2 టీస్పూన్లు


ఆవాలు - అర టీస్పూన్


శనగపప్పు - 2 స్పూన్


మినపప్పు - 1 స్పూన్ 


జీలకర్ర - 1 స్పూన్


కరివేపాకు - 1 రెబ్బ 


ఎండుమిర్చి -2 


ఉల్లిపాయలు - 250 గ్రాములు


పచ్చిమిర్చి - 2


బంగాళదుంప - 1 మీడియం సైజ్


అల్లం - అంగుళం


నిమ్మరసం - 1 స్పూన్


శనగపిండి - 2 టీస్పూన్లు


పసుపు - చిటికెడు


ఉప్పు - తగినంత 


నీరు - తగినంత 


తయారీ విధానం


ముందుగా పూరీ కర్రి కోసం ఉల్లిపాయలను సన్నని, పొడవు ముక్కలుగా కోయాలి. పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీల్చాలి. బంగాళదుంపను ఉడకబెట్టాలి. ఇప్పుడు శనగపిండిలో నీరు వేసి.. ముద్దలు లేకుండా.. సన్నని, మృదువైన పేస్ట్ మాదిరిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టండి. దానిలో నూనె వేసి.. అది వేడయ్యాక.. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అల్లం వేయించాలి. అవి కాస్త వేగాక.. ఎండుమిర్చి జీలకర్ర, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి.


అనంతరం ఈ తాలింపులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి పసుపు వేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త మెత్తగా అయ్యేవరకు మాత్రమే ఉడికించాలి. బాగా మెత్తగా ఉడికిస్తే కూరలో దీని రుచి మీకు తెలియదు. ఉల్లిపాయలు కాస్త వేగాక.. దానిలో అరలీటరు నీరు వేసి.. ఉప్పు కూడా వేసి బాగా తిప్పి.. మరగనివ్వాలి. నీరు మరిగిన తర్వాత ముందుగా పేస్ట్​గా తయారు చేసుకున్న పిండిని.. దీనిలో వేయాలి. పిండి ముద్దలు కాకుండా కలుపుతూ.. పిండిని వేయాలి. 


శనగపిండి బాగా కలిసి.. కాస్త ఉడికిన తర్వాత దానిలో ఉడికించుకున్న బంగాళదుంపలను చిన్నచిన్న ముక్కలుగా కోసి కర్రీలో వేయాలి. మీరు తాళింపు సమయంలో కూడా బంగాళదుంపలు వేయవచ్చు. లేదా ఇలా చివరి సమయంలో వేసినా బాగానే ఉంటుంది. రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేసి.. నిమ్మరసం వేయవచ్చు. నిమ్మరసం అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. చివర్లో తురిమిన కొత్తిమీరను గార్నిష్ కోసం వేసుకోవచ్చు. అంతే టేస్టీ టేస్టీ పూరి కూర రెడీ. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పూరీ కర్రీని ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇది పూరీల రుచినే రెట్టింపు చేస్తుంది. పైగా దీనిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా పూరీ కర్రీ చేసుకున్నప్పుడు ఈ రెసిపీని తయారు చేసేసుకోండి. 


Also Read : అటుకులతో ఇడ్లీలు.. పుదీనా, టమాటాలతో చట్నీ.. కాంబినేషన్ అదుర్స్