ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్న వ్యాధుల్లో అధిక కొలెస్ట్రాల్ ఒకటి. వివిధ హార్మోన్లు, విటమిన్ డి, శరీరంలో ఆరోగ్యకరమైన కణజాలాలకు కొలెస్ట్రాల్ అవసరం. కానీ అవసరానికి మించి ఉంటే తీవ్రమైయా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అధిక కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతే చాలా ప్రమాదం. కొలెస్ట్రాల్ నీటిలో కరగదు అందుకే శరీరంలోనూ స్వతంత్రంగాను కదలదు. నివారణ మన చేతుల్లోనే ఉంటుంది. మందులు అలాగే మంచి ఆహారం, వ్యాయామం వల్ల అధిక కొలెస్ట్రాల్ ని కరిగించుకోవడంలో సహాయపడతాయి.
అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు తరచుగా కనిపించవు. కానీ పట్టించుకోకుండా వదిలేస్తే అత్యవసర పరిస్థితులకు దారి తీస్తుంది. దీని వల్ల గుండె పోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయినప్పుడు కొన్ని సంకేతాలు చూపిస్తుంది. అవేంటంటే..
తిమ్మిరి: అధిక కొలెస్ట్రాల్ వల్ల నరాలు ప్రభావితమవుతాయి. ఫలితంగా చేతులు, కాళ్ళలో జలదరింపు, తిమ్మిరిగా అనిపిస్తుంది. కొలెస్ట్రాల్ ఏర్పడటం వల్ల రక్తప్రసరణ సరిగా జరగక ఇటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.
శ్వాస ఆడకపోవడం: అధిక కొలెస్ట్రాల్ తో సహా అనేక గుండె సంబంధిత సమస్యలకు శ్వాస ఆడకపోవడం ఒక విలక్షణమైన సంకేతం. ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు గుండెకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
ఛాతీ నొప్పి: ఛాతీలో అసౌకర్యంగా అనిపిస్తుంది. దీన్ని ఆంజీనా అని కూడా పిలుస్తారు. కరొనరీ ఆర్టరీ వ్యాధి ఉన్న వారిలో అధిక కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల అడ్డంకులు ఏర్పడతాయి. ఇది అనారోగ్యానికి కారణమవుతుంది.
అలసట: అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులు వారి రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాలకు రక్త సరఫరాను తగ్గిస్తుంది. ఫలితంగా తీవ్ర అలసటకు దారి తీస్తుంది.
అధిక రక్తపోటు: రక్తపోటు పెరిగిపోతుంది. ధమనుల్లో కొలెస్ట్రాల్ చేరడం వల్ల రక్తనాళాల నిరోధకత పెరుగుతుంది.
దృష్టి సమస్యలు: శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ చూపును కూడా ప్రభావితం చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే కళ్ళకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. దీని వల్ల చూపు మందగిస్తుంది. దృష్టి లోపం సమస్యలు ఎదురవుతాయి.
ఇవే కాదు రాత్రి సమయంలో పడుకున్నప్పుడు పాదాలు, కాళ్ళలో మంట లేదా నొప్పి వస్తుంది. చర్మం రంగులో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. కాలి పుండ్లు, పాదాల పుండ్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివి ఏ లక్షణాలు కనిపించినా కూడా శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉందని అర్థం. దీన్ని అదుపులో ఉంచుకోవడం కోసం మంచి ఆహారం సరైన మార్గం. ఇవి డైట్లో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవచ్చు.
టొమాటో, యాపిల్, సీజనల్ ఫ్రూట్స్, నారింజ వంటి సిట్రస్ పండ్లు, అవకాడో, బొప్పాయి వంటివి తరచూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఇవే కాదు కూరగాయల్లో క్యారెట్ ఎక్కువగా తీసుకుంటే గుండెకి చాలా మేలు చేస్తుంది. క్యారెట్ తినడం వల్ల రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: జీవిత భాగస్వామితో కలిసి నిద్రపోతే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?