టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆదిపురుష్'. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. రామాయణం, ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ మైథాలజికల్ డ్రామా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తో రూపొందింది. రెట్రో ఫైల్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ సుమారు రూ.550 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. జూన్ 16న పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో మూవీ టీం ఆదిపురుష్ ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలను తారస్థాయికి చేరుస్తున్నారు.


అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా మూవీ టీం ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయ్యే ప్రతి థియేటర్లో ఒక సీటు ని హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచడానికి మేకర్స్ నిర్ణయించగా.. తాజాగా మేకర్స్ మరో మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు ఏకంగా పదివేలకు పైగా టికెట్లను ఉచితంగా ఇవ్వబోతున్నారు. ఇదే విషయాన్ని మూవీ టీం అధికారికంగా ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.


"ఈ జూన్ లో అత్యంత గొప్ప వ్యక్తిని స్మరించుకుందాం. మర్యాద పురుషోత్తముని స్మరించుకుందాం. ఆదిపురుష్ వేడుకలు జరుపుకుందాం. శ్రీరాముని ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం. ఈ తరం ఆయన గురించి తెలుసుకోవాలి. అతని దివ్య అడుగుజాడలను అనుసరించాలి. మునుపెన్నడూ లేని అనుభూతిలో మునిగిపోదాం. అభిషేక్ అగర్వాల్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు పదివేలకు పైగా టికెట్లను ఉచితంగా ఇస్తారు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా గూగుల్ ఫారం ను పూరించండి. మీ వివరాలను నమోదు చేసుకోండి. మేము మీకు టికెట్లు పంపుతాం’’ పేర్కొన్నారు. ఈమెయిల్‌తో పాటు సంప్రదించేందుకు ఫోన్ నెంబర్‌ను కూడా ఇచ్చారు. ఈ మెయిల్: info@agarwalarts.com, కాంటాక్ట్ : 95050345672 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.


కాగా 'ఆదిపురుష్' రిలీజ్ సందర్భంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ చేపడుతున్న గొప్ప కార్యం ఇది అని చెప్పవచ్చు. ఎందుకంటే రామాయణాన్ని చూడ్డానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందులో ఆర్థిక స్థోమత లేనివారు, సినిమా టికెట్ కొనుక్కోలేని వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇక అభిషేక్ అగర్వాల్ విషయానికొస్తే.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించి 'ది కాశ్మీర్ ఫైల్స్',  'కార్తికేయ 2' లాంటి పాన్ ఇండియా సినిమాలను నిర్మించారు. ఈ సినిమాలు భారీ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం ఆయన నిర్మాతగా పలు పాన్ ఇండియా సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.