ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా నెయ్యి ఉంటుంది. వంటకాల్లో నెయ్యి దట్టిస్తే దానికి 10 రెట్లు అదనపు రుచి వస్తుంది. వేడి వేడి అన్నంలో అప్పుడే పెట్టిన ఆవకాయ అందులో నెయ్యి వేసుకుని తింటుంటే ఎలా ఉంటుందంటారు. అబ్బా.. చెప్తుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయా కదా. సూపర్ టేస్ట్ కదా అది. నెయ్యి అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా చెప్పండి. ఆవు పాలతో చేసిన నెయ్యి మంచిదా లేదా సాధారణమైన నెయ్యి మంచిదా అని మనలో చాలా మందికి సందేహం వస్తుంది. నిజానికి రెండూ ఆరోగ్యానికి మంచిదే. కాకపోతే ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎటువంటి హాని చెయ్యదు. ఇష్టం కదా అని అమితంగా తింటే మాత్రం అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిందే. రోజూ నెయ్యి తినడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయ్ కొంత నష్టం కూడా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
నెయ్యి వల్ల లాభాలు..
నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్నాయి. క్లారిఫైడ్ వెన్నలో పాల కొవ్వులు మరియు ప్రోటీన్లు ఉంటాయి. ఇది మితంగా తీసుకున్నపుడే గుండె ఆరోగ్యానికి సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, రోజూ నెయ్యి కొద్దిగా తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎముకలను బలోపేతం చేస్తుంది. మరొక అధ్యయనం ప్రకారం నెయ్యి వల్ల జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది. అంతే కాదు కడుపులో ఉన్న అల్సర్లను నివారిస్తుంది. మాల బద్దకాన్ని నివారించడంతో పాటు ప్రేగుల పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది మరియు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయకారిగా ఇది ఉపయోగపడుతుంది.
ఆయుర్వేద పద్ధతి ప్రకారం నెయ్యిని మందుల్లో కూడా ఉపయోగించేవాళ్ళు. చర్మం, జుట్టు సంరక్షణ కోసం కూడా నెయ్యిని వినియోగిస్తారు. కాలిన గాయాలపై వెన్న లేదా నెయ్యిని పూయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇది దెబ్బలకు గొప్ప ఔషధంగా పని చేస్తుంది. చర్మ సంరక్షణ కోసం సౌందర్య ఉత్పత్తుల కంటే నేయ్యే బాగా పని చేస్తుందని కొంతమంది నమ్ముతారు.
నెయ్యి వల్ల నష్టాలు..
నెయ్యిలో సంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉండటం వల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ధమనుల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే ఫ్యాటీ లివర్, గుండె సమస్యలతో బాధపడే వాళ్ళు నెయ్యి తినకపోవడమే ఉత్తమం. నెయ్యి అతిగా తీసుకోవడం వల్ల ఊబకాయం, చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నపుడు, జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్ళు నెయ్యికి దూరంగా ఉండాలి. నెయ్యిలో కొవ్వు పుష్కలంగా ఉన్నందున సీనియర్ సిటిజెన్లలో గుండె జబ్బు, క్యాన్సర్ ప్రమాదానికి దారి తీస్తుంది. వృద్ధులు తమ గుండెని ప్రమాదంలో పడకుండా ఉండేందుకు నెయ్యికి తప్పని సరిగా దూరంగా ఉండాలి. విరేచనాల సమయంలో కూడా నెయ్యి తీసుకోకుండా ఉండండి.
Also Read: పచ్చి పాలు తాగడం సురక్షితమేనా? పచ్చిగా తాగడం వల్ల సమస్యలు వస్తాయా?
Also read: మగవారితో పోలిస్తే ఆడవారికే ఎక్కువ నిద్ర అవసరం, ఎందుకో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.