ఆఫీసులో తొమ్మిది నుంచి పన్నెండు గంటల పాటూ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైతే కనీసం కదలనైనా కదలరు. ప్రాజెక్టులు, డెలివరీలు అంటూ లేచి రెండు అడుగులు కూడా వేయరు. ఇది చాలా ప్రమాదకరైమన ఆరోగ్యపరిస్థితులకు దారితీస్తుందని చెబుతోంది కొత్త అధ్యయనం. ఇది స్ట్రోక్ లేదా గుండె పోటు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. అలా గంటలపాటూ కూర్చోవడం అనారోగ్యకరమైన జీవనశైలి కిందకే వస్తుందని చెబుతున్నారు అధ్యయనకర్తలు. 


చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం రోజులో ఎనిమిది గంటలు డెస్క్‌ల వద్ద కూర్చునే ఉద్యోగులకు గుండె పోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం 20 శాతం ఎక్కువ. పదకొండేళ్ల పాటూ పరిశోధకులు 21 దేశాలకు చెందిన 1,05,677 మంది వ్యక్తుల ఆరోగ్య రికార్డును పరిశీలించారు. అధ్యయనం ముగిసే సమయానికే వారిలో 6,200 మందికి పైగా మరణించారు. అందులో 2,300 గుండె పోటు కేసులు, 3000 స్ట్రోకులు వచ్చిన కేసులు, 700 గుండె వైఫల్యం కేసులు ఉన్నాయి. 


కదలకుండా కూర్చోకూడదు...
ఒక ఉద్యోగులు డెస్క్ వద్దే కదలకుండా కూర్చోవడాన్ని తగ్గించాలని అధ్యయనం సూచిస్తోంది. ప్రతి గంటకోసారైనా కనీసం ఇటూ అటూ కాసేపు నడవమని చెబుతోంది. శారీరక శ్రమ లేకపోవడం గుండెకు చేటు చేస్తుంది. శారీరక శ్రమ లేకపోవడంతో పాటూ ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల 8.8శాతం మరణాలు, 5.8 శాతం గుండె జబ్బులు సంభవించాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే పని మధ్యమధ్యలో విరామం తీసుకోవాలని ప్రజలకు చెబుతున్నారు అధ్యయనకర్తలు. 


పెరిగిపోతున్న గుండె జబ్బులు
గుండె వ్యాధులు నిశ్శబ్ధంగా పెరిగిపోతున్నాయి. మనదేశంలో అనేక మరణాలకు కారణమవుతున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో గుండె జబ్బుల బారిన పడిన వారిలో 60 శాతం మంది మన దేశంలోనే ఉన్నారు. ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్, హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజ్, సెరెబ్రోవాస్కులర్ డిసీజ్ వంటివి అధికంగా భారత్ ప్రజలపై దాడి చేస్తున్నాయి. 


ఒత్తిడి కూడా...
ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది. ఊబకాయం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ పెరగడం, ఆస్టియో ఆర్ధరైటిస్ వంటి ఆరోగ్యప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇవన్నీ చివరకు గుండె వైఫల్యానికి దారి తీస్తాయి. 


కదులుతూ ఉండాలి...
గంటకోసారైనా రెండు రౌండ్లు వేగంగా నడవాలి. పని చేసినప్పుడు కాకుండా మిగతా సమయంలో కనీసం అరగంటైనా వాకింగ్, ఇతర వ్యాయామాలు చేయాలి. లిఫ్టు వాడడం మానేసి, మెట్లు ఎక్కి దిగడం అలవాటు చేసుకోవాలి. 


Also read: ఆ ఊరికి అల్లుడిగా వెళతారా? కట్నంగా ఏమిస్తారో తెలిస్తే చచ్చినా వెళ్లరు


Also read: పిజ్జా, బర్గర్లలో అతిగా చీజ్ వేసుకుని లాగిస్తున్నారా? అయితే ఈ హెచ్చరిక మీకే