నువ్వుల వల్ల లాభాలు ఇన్నీ అన్నీ కావు. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం. రోజూ దీన్ని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. నువ్వులను రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని పలు అధ్యయనాలు చెప్పాయి. నువ్వుల్లో ఉండే కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. హైబీపీ సమస్య ఉన్నవారు రోజూ నువ్వులను తింటే ఎంతో మేలు. రక్తపోటు తగ్గడంతో పాటూ, అవయవాలను రక్త సరఫరా మెరుగుపడుతుంది. వీటిలో విటమిన్ బి1, బి3, బి6 పుష్కలంగా ఉంటాయి. నువ్వులు రోజు తినడం వల్ల ఐరన్ లోపం రాదు. అందుకే రక్తహీనత ఉన్నవారికి ఇవి మంచి పోషకాహారం. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నువ్వులు తినడం చాలా అవసరం. షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. దీని కారణంగా మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి కనుక రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా రెచ్చిపోతున్న వేళ రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా అవసరం. 


నువ్వుల పొడి తయారీ...
కావాల్సిన పదార్థాలు
నువ్వులు - వంద గ్రాములు
వేరు శెనగ పలుకులు - 50 గ్రాములు
పుట్నాల పప్పు - 50 గ్రాములు
ధనియాలు - ఒక టేబుల్ స్పూను
ఎండు కొబ్బరి పొడి - ఒక టేబుల్ స్పూను
ఎండు మిరపకాయలు - పది (మరీ కారంగా కావాలనుకుంటే 15 దాకా వేసుకోవచ్చు)
జీలకర్ర - ఒక టేబుల్ స్పూను
మెంతులు - ఒక టేబుల్ స్పూను
పసుపు - అర టేబుల్ స్పూను
ఉప్పు - రుచికి సరిపడా


తయారీ
స్టవ్ మీద కళాయి పెట్టి నువ్వులను వేయించాలి. నువ్వులు త్వరగా వేగిపోతాయి కనుక దగ్గరుండి చూసుకోవాలి. వాటిని తీసి వేరే గిన్నెలో వేయాలి. ఇప్పుడు వేరు శెనగపలుకులు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత పుట్నాల పప్పు కూడా ఓసారి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కళాయిలో మెంతులు జీలకర్ర, ఎండు మిరపకాయలు, ధనియాలు, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించిన నువ్వులు, వేరు శెనగపలుకులు, పుట్నాల పప్పు, పోపు దినుసులు, ఎండుకొబ్బరి అన్నీ వేసి పొడి చేసుకోవాలి. అంతే నువ్వుల పొడి సిద్ధమైనట్టే. దీన్ని గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేసుకోవాలి. రోజు అన్నం తినేటప్పుడు ఒక స్పూను నువ్వుల పొడి వేసుకుని కలుపుకుని తింటే చాలా మంచిది.  


Also read: ఆయన 129 మంది పిల్లలకు తండ్రి... ఉచిత వీర్యదాత, ఫేస్‌బుక్‌లో వినూత్న సేవ


Also read: ‘వ్యాక్సిన్ వేసుకోకపోవడం నా తప్పే’... కరోనాతో మరణించడానికి కొన్ని క్షణాల ముందు ఓ తండ్రి పశ్చాత్తాపం