మానవాళిపై కమ్ముకున్న మహమ్మారి కరోనా. వ్యాక్సిన్ రాకముందు వేల మంది ప్రాణాలను బలిగొంది. చీకట్లో చిరుదివ్వెలా వచ్చాయి వ్యాక్సిన్లు. అవి కరోనా రాకుండా అడ్డుకోలేకపోవచ్చు, కానీ మరణాల సంఖ్యను మాత్రం తగ్గించాయన్నది వాస్తవం. అయినా కూడా ఇప్పటికీ చాలా మంది లేనిపోని అపోహలతో, నిర్లక్ష్యంతో వ్యాక్సిన్ వేయించుకోకుండా కాలయాపన చేస్తున్నారు. వైద్యులు, ప్రభుత్వాలు ఎంతగా మొరపెట్టుకుంటున్నా... ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోని వారు కోట్లలో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు క్రిస్టియన్ కాబెరా. ఆయన వ్యాక్సిన్ వేయించుకోనందుకు చాలా పశ్చాత్తాపడ్డాడు. కానీ ఆ పశ్చాత్తాపం ఆయనకు కలిగే సరికే సమయం మించిపోయింది. కరోనా అతని ప్రాణాలను తీసేసింది. ఈ ఘటన లాస్‌ఏంజలస్ లో జరిగింది.
సైన్సుపై నమ్మకం లేక...
క్రిస్టియన్ కాబెరాకు 40 ఏళ్లు. వారింట్లో అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నా తాను మాత్రం వేయించుకోవడానికి ఇష్టపడలేదు. అతనికి భార్య, మూడేళ్ల కొడుకు కూడా ఉన్నారు. ఇతనికి సైన్సు పట్ల నమ్మకం తక్కువ. అందుకే వ్యాక్సిన్‌ను నిర్లక్ష్యం చేసినట్టు అతని తమ్ముడు గినో మీడియాకు చెప్పాడు. ‘క్రిస్టియన్ ఒక్కసారి కూడా అనారోగ్యం బారిన పడలేదు. అందుకే అతను చాలా ధీమాగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి కరోనా బారిన పడడంతో ఆసుపత్రిలో చేర్చాం’ అని చెప్పుకొచ్చాడాయన. కాగా చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు క్రిస్టియన్ తన కుటుంబ సభ్యులు మెసేజ్ పంపాడు. ముందుగా ‘నేను ఊపిరిపీల్చుకోలేకపోతున్నా’ అని పెట్టాడు. తరువాత ‘నేను చాలా పశ్చాత్తాపపడుతున్నా... వ్యాక్సిన్ తీసుకోనందుకు. ఒకవేళ నేను వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. నా ప్రాణం నిలిచేది’ అని మెసేజ్ చేశాడు.
అలా మెసేజ్ చేసిన కొంత సమయం తరువాత క్రిస్టియన్ మరణించినట్టు కబురు పంపారు వైద్యులు. అతను కరోనా బారిన పడ్డాక వారం రోజులపాటూ ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. ఊపిరితిత్తులకు తీవ్రస్థాయిలో నిమోనియా సోకడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. ఊపిరితిత్తులు పూర్తిగా పాడవడంతో క్రిస్టియన్ మరణించాడు. అమెరికాలో దాదాపు వ్యాక్సినేషన్ పూర్తయింది. కానీ క్రిస్టియన్ లాంటి వాళ్లు అతి నమ్మకంతో వ్యాక్సిన్ వేయించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
కరోనాలాంటి మహమ్మారి ఎదుర్కోవాలంటే మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి సరిపోదు. దానికి మరింత బలాన్ని అందివ్వాలి. యాంటీ బాడీలు అవసరం పడతాయి. వ్యాక్సిన్లు కరోనాతో పోరాడే శక్తిని మన శరీరానికి అందిస్తాయి. కాబట్టి వ్యాక్సిన్లు వేయించుకోకుండా తాత్సారం చేస్తున్నవాళ్లంతా ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవడం అన్ని విధాలా మంచిది. మీ కుటుంబం కోసమైనా మీరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే.