కొత్త జిల్లాల ఏర్పాటును హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమర్థించారు. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ కోసం రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేయాల‌న్న ప్రభుత్వ నిర్ణయాన్ని  సమంజసమేనన్నారు. అయితే వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా  జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని కోరారు. దీనికి కారణం ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లలో జిల్లాల కేంద్రాలు కొన్ని మారిపోయాయి. మారిపోయిన వాటిలో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం కూడా ఉంది. 


హిందూపురం నియోజకవర్గం కేంద్రాన్ని జిల్లా చేయాలని ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం కూడా . దీంతో ప్రభుత్వం ఎప్పుడు కొత్త జిల్లాలు ప్రకటించినా హిందూపురం జిల్లా అవుతుందని అనుకున్నారు. కానీ పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ప్రకటించారు. దీంతో నందమూరి  బాలకృష్ణ అసంత-ృప్తికి గురయ్యారు.  అనంత‌పురం జిల్లాలో హిందూపురం అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందిందని.. వ్యాపార‌ప‌రంగా, వాణిజ్యప‌రంగా, పారిశ్రామికంగా.. అన్ని ర‌కాలుగా ఎంతో అభివృద్ధి చెందిన విష‌యం అంద‌రికీ తెలిసిందేనని అందుకే హిందూపురం కేంద్రంగా స‌త్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాల‌ని ప్రభుత్వాన్ని కోరారు. 


హిందూపురం ప‌ట్టణ ప‌రిస‌రాల్లో ప్రభుత్వ కార్యాల‌యాల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భూమి పుష్కలంగా ఉంద‌నన్నారు. అందుకే  జిల్లాల‌ ఏర్పాటులో రాజ‌కీయం చేయవద్ద ..హిందూపురం ప్రజ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించి వారి చిరికాల కోరికైన హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. గతంలో కూడా బాలకృష్ణ ఈ డిమాండ్‌ను చాలా సార్లు చేశారు. జిల్లాల విభజనకు మద్దతు పలికి హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. 


విస్తీర్ణంలో దేశంలోనే ఏడో అతి పెద్ద జిల్లాగా రికార్డుకెక్కిన అనంతపురంను రెండు జిల్లాలు చేస్తున్నారు. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఒకటి కాగా అనంతపురం జిల్లా మరొకటి. అనంతపురం జిల్లా పరిధిలోకి 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, సత్యసాయి జిల్లా పరిధిలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సత్యసాయి జిల్లాలోకి పుట్టపర్తి, కదిరి, హిందూపురం, మడకశిర, పెనుకొండ, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాలు వ‌స్తున్నాయి. హిందూపురం జిల్లాలోకి ఓ నియోజకవర్గాన్ని తగ్గించారు.  


జిల్లాలపై నోటిఫికేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ప్రభుత్వం నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ లోపు హిందూపురం ప్రజల తరపున బాలకృష్ణ తన డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి .. జిల్లా కేంద్రం సాధిస్తారా లేక ప్రభుత్వం బాలకృష్ణ డిమాండ్‌ను లైట్ తీసుకుంటుందో వేచి చూడాలి.