భారత హాకీ దిగ్గజాల్లో ఒకరైన చరణ్‌జిత్ సింగ్ గురువారం మరణించారు. ఆయన స్వగ్రామమైన హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో ఆయన మరణించారు. ప్రస్తుతం ఆయనకు 90 సంవత్సరాల వయసు కాగా.. మరో నెలలో 91 సంవత్సరాలు వచ్చేవి. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1964లో టోక్యో ఒలంపిక్స్‌లో బంగారు పతకం గెలిచిన జట్టుకు చరణ్‌జిత్ సింగే కెప్టెన్‌గా వ్యవహరించారు. చరణ్‌జిత్ సింగ్‌కు ఐదు సంవత్సరాల క్రితం గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆయన పక్షవాతం బారిన పడ్డారు.


‘ఐదు సంవత్సరాల క్రితం గుండెపోటు వచ్చినప్పటి నుంచి నాన్న పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆయన గతంలో చేతి కర్ర సాయంతో నడిచేవారు. అయితే గత కొంతకాలం నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈరోజు పొద్దున్న ఆయన మరణించారు.’ అని చరణ్‌జిత్ సింగ్ కుమారుడు వీపీ సింగ్ తెలిపారు.


1964లో స్వర్ణ పతకం గెలవడానికి ముందు.. 1960 ఒలంపిక్స్‌లో రజతం గెలిచిన జట్టులో కూడా ఆయన సభ్యులుగా ఉన్నారు. 1962 ఏసియన్ గేమ్స్‌లో రజతం గెలిచిన జట్టులో కూడా ఆయన సభ్యుడే. ఆయన అంత్యక్రియలు గురువారమే జరుగుతాయని వీపీ సింగ్ తెలిపారు.


చరణ్‌జిత్ సింగ్ భార్య 12 సంవత్సరాల క్రితమే మృతి చెందారు. ఆయన పెద్ద కుమారుడు కెనడాలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు ఆయన మరణించినప్పుడు పక్కనే ఉన్నారు. ఆయన కూతురు వివాహం చేసుకుని ఢిల్లీలో సెటిల్ అయ్యారు.