భారత మార్కెట్లు గురువారం రక్తమోడాయి! కీలక సూచీలన్నీ భారీగా పతనమవుతున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు పెరుగుతాయన్న వార్తలు రావడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మార్కెట్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1390, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 405, నిఫ్టీ బ్యాంక్ 675 పాయింట్ల మేర పతనం అయ్యాయి.
క్రితం సెషన్లో 57,858 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,317 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. అక్కడ్నుంచి దిగువ ముఖంగానే సూచీ పయనిస్తోంది. 56,439 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 12:30 గంటలకు 1308 పాయింట్ల నష్టంతో 56,573 వద్ద కొనసాగుతోంది.
Also Read: LIC Profits: ఎల్‌ఐసీ బంపర్ ప్రాఫిట్..! ఐపీవో ముందు అదరగొట్టిన బీమా సంస్థ
మంగళవారం 17,277 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,062 వద్ద గ్యాప్‌డౌన్ ఆరంభమైంది. ఆ తర్వాత అథో ముఖంగా పయనిస్తూ 16,866 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 340 పాయింట్ల నష్టంతో 16,933 వద్ద కొనసాగుతోంది.
బ్యాంక్ నిఫ్టీ ఒడుదొడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 37,058 వద్ద మొదలైన సూచీ 37,012 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 484 పాయింట్ల నష్టంతో 37,221 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీలో 5 కంపెనీలు లాభాల్లో ఉండగా 45 నష్టాల్లో ఉన్నాయి. సిప్లా, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఎస్‌బీఐ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, విప్రో, ఐచర్ మోటార్స్, టెక్ మహీంద్రా నాలుగు శాతానికి పైగా నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు మినహాయిస్తే మిగతా అన్ని రంగాల సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. టెక్నాలజీ, డిజిటల్ రంగ కంపెనీల షేర్లు విలవిల్లాడుతున్నాయి.